27 July, 2026 | 5:36 PM

మందుబాబుల బైక్‌లే టార్గెట్!

30-05-2024 02:00 AM

చోరీ చేసిన బైక్‌ల విలువైన పార్ట్స్ విక్రయం 

అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు

మేడ్చల్, మే 29: మందుబాబుల బైక్‌లే అతని టార్గెట్. జల్సాలకు అలవాటు పడి ద్విచక్రవాహనాలను చోరీ చేసి విడి భాగాల ను విక్రయించగా వచ్చిన సొమ్ముతో మద్యం సేవించడం, ఇతర అవసరాలు తీర్చుకోవడం రివాజుగా మార్చుకున్నాడు. బాలానగర్ ఏసీపీ హన్మంతరావు, ఎస్‌హెచ్‌ఓ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం... మెదక్ జిల్లా శివ్వంపేట్ మండలం లచ్చిరెడ్డిగూడెంకు చెందిన వారెం చంద్రారెడ్డి కుమారుడు ఆనంద్‌రెడ్డి(28) తాగుడుతో పాటు జల్సాల కు అలవాటు పడి దొంగతనాలు చేసి జైలుకెళ్లాడు.

ఇలా 11 దొంగతనాలకు పాల్పడి జైలుకెళ్లిన ఆనంద్‌రెడ్డి.. విడుదలైన తర్వాత కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం కాలనీలోని కృష్ణానగర్‌కు ఉపాధి కోసం వలస వచ్చాడు. ఇక్కడ కూడా ఈజీ మనీ కోసం ద్విచక్రవాహనాలను దొంగిలించి, వాటి విడి భాగాలను విక్రయించగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. రూ.500ల మందుబాటిల్ కోసం కూడా బైక్‌ను దొంగిలించి విడి భాగాలను విక్రయించి మద్యం సేవించేవాడు.

ఇలా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని జగద్గిరిగు ట్టలో 2, బాచుపల్లి, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, ఆర్‌సీపురం, మేడ్చల్, పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఒక్కో వాహనం, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని చౌటుప్పల్‌లో1, మెదక్ జిల్లాలోని శంకరంపేట్, తూప్రాన్, గజ్వేల్, ఐడీఏ బొల్లారం పీఎస్, సంగారెడ్డి పీఎస్‌ల పరిధిలో ఒక్కో వాహనం దొంగతనం చేశాడు. వీటిని తీసుకెళ్లి విడి భాగాలను తీసి విక్రయించాడు.

మంగళవా రం బాచుపల్లి పీఎస్ పరిధిలోని ఆర్‌ఆర్‌ఆర్ వైన్స్ ముందు ఓ వాహనం దొంగిలిస్తుండగా జగద్గిరిగుట్ట సీఐ క్రాంతికుమార్, డీఐ అంజయ్యతో పాటు ఇతర సిబ్బంది పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి దొంగిలించిన 22 ద్విచక్రవాహనాలతో పాటు ఒక ఆటోను స్వాధీ నం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును ఛేదించిన వారికి ఏసీపీ హన్మంతరావు రివార్డును అందజేసి అభినందించారు.