విత్తన దుకాణాల్లో పోలీసుల తనిఖీలు
సిద్దిపేట/ ఇబ్రహీంపట్నం, మే 29 (విజయక్రాంతి): సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు విత్తన దుకాణాల్లో వ్యవసాయాధికారులతో కలిసి పోలీసులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చేర్యాల, కుకునూర్‌పల్లి, మద్దూర్ మండలాల్లో ఎస్సైలు దామోదర్, శ్రీనివాస్, యూనస్ అహ్మద్ ఆధ్వర్యంలో, సిద్దిపేట త్రీటౌన్ ఎస్సై సూర్యనారాయణ ఆధ్వర్యంలో బందారం, అంకిరెడ్డిపల్లి, సిర్సినగండ్ల, మర్పడగ గ్రామాల్లోని విత్తన దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణాల్లోని స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్‌లు, రికార్డులను, విత్తనాలు, ఎరువులను పరిశీలించారు. నకిలీ, కాలం చెల్లిన విత్తనాలు, పురుగుల మందులను రైతులకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు..
వ్యవసాయ శాఖ ద్వారా లైసెన్స్ పొందిన డీలర్ల వద్దే రైతులు వితనాలు, ఎరువులు కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి (డిఏఓ) గీతారెడ్డి కోరారు. ఇబ్రహీంపట్నం మండలంలోని ఉప్పరిగూడ గ్రామంలో వ్యవసాయ అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్ర మంలో డీఏఓ గీతారెడ్డి పాల్గొని మాట్లాడారు. విత్తనం ఎంపికలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వేసవి దుక్కల వల్ల కలిగే ప్రయోజనాలు తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎమ్‌ఏఓ వరప్రసాద్ రెడ్డి, ఏఈఓ రఘు, గ్రామ పంచాయతి సెక్రటరీ రిషిక నేత, రైతులు పాల్గొన్నారు.






