27 July, 2026 | 4:46 PM

ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలి

30-05-2024 02:01 AM

కూకట్‌పల్లి, మే 29 : ఆల్విన్‌కాలనీ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో నిత్యం ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోందని, ట్రాఫిక్ అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేయాలని శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పేర్కొన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని విజయనగర్ కాలనీ, నవోదయ కాలనీలలో ట్రాఫిక్ పోలీసులు, స్థానిక కాలనీ వాసులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందించి, వెంటనే పరిష్కరించాలని ట్రాఫిక్ పోలీసులను కోరారు. నిత్యం ట్రాఫిక్ రద్దీతో ఉదయం, సాయంత్రం వేళల్లో పాఠశాల విద్యార్థులు, ఉద్యోగులు నరకయాతన అనుభవిస్తున్నారని అన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని, ప్రజలు గమ్యస్థానాలకు త్వరగా చేరుకునే విధంగా చూడాలని ట్రాఫిక్ పోలీసులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్‌ఐ రమేష్, స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు కాశీనాథ్ యాదవ్, సత్యనారాయణ, నవీన్, స్వరూప, లావణ్య, కాలనీ వాసులు పాల్గొన్నారు.