18 July, 2026 | 10:09 PM

48 గంటల్లో ఇంటి చోరీ కేసు ఛేదించిన భిక్కనూర్ పోలీసులు

18-07-2026 09:30 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలో జరిగిన ఇంటి చోరీ కేసును పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించారు. జూలై 16న దొడ్ల స్వామి ఇంట్లో నుంచి సుమారు 6 తులాల బంగారం, 60 తులాల వెండి, నగదు చోరీకి గురవగా, జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఆదేశాలతో డీఎస్పీ ఎస్. మధుసూదన్ పర్యవేక్షణలో సీఐ జె. నరేష్, ఎస్‌ఐ ఎస్. అనిల్ ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో అదే గ్రామానికి చెందిన దొడ్లె లత (27)ను అరెస్ట్ చేసి, చోరీకి గురైన బంగారం, వెండి ఆభరణాలను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. షాపింగ్‌కు వెళ్లానంటూ బస్సు టికెట్లు, బిల్లులతో అలిబీ సృష్టించే ప్రయత్నం చేసినా డిజిటల్ ఆధారాలతో ఆమె అబద్ధాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. కేసును వేగంగా ఛేదించిన సీఐ నరేష్, ఎస్‌ఐ అనిల్, ఏఎస్‌ఐ వెంకటరావు, పీసీలు శ్రీకాంత్, కిషన్ గౌడ్, బాలకృష్ణ తదితరులను జిల్లా ఎస్పీ అభినందించారు.