6 May, 2026 | 2:37 AM

వరిగడ్డే ముడిసరుకుగా బయోగ్యాస్

06-05-2026 01:21 AM
  1. ప్రతిపంటను కొంటాం, కేంద్రం మొత్తం తీసుకోవాలి
  2. సిరిసిల్ల జిల్లా గంబీరావుపేటలో ప్లాంట్ నిర్మాణానికి భూమిపూజ
  3. బయోగ్యాస్ బృహత్తర ఆలోచన అన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క

సిరిసిల్ల, మే 5 (విజయక్రాంతి): వరిగడ్డిని ముడిసరుకుగా ఉపయోగించి బయోగ్యాస్ ఉత్పత్తి చేసే బృహత్తర ఆలోచనను రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కార్యరూపంలోకి తీసుకురావడం సంతోషకరమని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు.

రైతులు పండించే ప్రతిపంటను కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతుధర ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, సేకరించిన ధాన్యాన్ని కేంద్రం మొత్తం తీసుకో వాలని కోరారు. రైతులకు ఆనేక రకాల ప్రోత్సహకాలు అందించి అండగా నిలబడుతున్నామని చెప్పారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కేంద్రాన్ని ఉపముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

సిరిసిల్ల జిల్లా గంబీరావుపేట గ్రామంలోని పంతులుగారి తోటలో బయోస్ట్రాటమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటేడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి మంగళవారం డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయతో కలిసి భూమి పూజ చేశారు.

సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గంలోని 11 ప్రాంతాలలో 30 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 33/11 కేవీ సబ్ స్టేషన్‌లకు శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడారు. వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవానికి నాందీ పలుకుతున్నామని చెప్పారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తుందన్నారు.

అభివృద్ధి చెందిన దేశాల బాటలో మన రైతాంగం కూడా అడుగులు వేయాలని ప్ర భుత్వం ఆకాంక్షిస్తోందని చెప్పారు. రైతులు వరిమీదనే ఆధారపడకుండా ఉద్యానవన పంటలు, చిరుధాన్యాలు, ఆయిల్ పామ్ వంటి లాభదాయకమైన పంటల వైపు దృష్టి సారించినప్పుడే ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని తెలిపారు.

రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తమ ప్రభుత్వం పండించిన ప్రతిగింజకూ కనీస మద్దతు ధర  కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉందని మద్దతుధర ప్రకటించడమే కాకుండా, క్షేత్రస్థాయిలో కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, డీఎ స్పీ నాగేంద్రాచారి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచ్ మల్లుగారి పద్మ  పాల్గొన్నారు.