ఎయిరిండియా విమానాన్ని ఢీకొన్న పక్షి
- ఢిల్లీ నుంచి పుణెకు వెళ్తున్న విమానానికి తప్పిన ప్రమాదం
- వివిధ సాంకేతిక కారణాలతో 9 విమాన సర్వీసులు రద్దు
న్యూఢిల్లీ, జూన్ 20: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కుప్పకూలి 275 మంది చనిపోయిన ఘటన మరువకముందే తాజా ఎయిర్‌ఇండియా విమానానికి మరో ప్రమాదం తప్పింది. శుక్రవారం ఢిల్లీ నుంచి పూణెకు ప్రయాణిస్తున్న ఏఐ-2470 నెంబర్ ఎయిరిండియా విమానాన్ని ఓ పక్షి ఢీకొంది. అయితే ఈ విషయాన్ని పైలెట్ గుర్తించకపోవడం గమనార్హం. విమానం పూణెలో ల్యాండింగ్ అయిన తర్వాత ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించారు.
వెంటనే తిరుగు ప్రయాణాన్ని అధికారులు రద్దు చేశారు. దీంతో పాటు వివిధ సాంకేతిక కారణాల వల్ల మరో ఎనిమిది సర్వీసులను సైతం ఎయిర్‌ఇండియా నిలిపేసింది. ఎయిరిండియా సంస్థకు చెందిన పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు బయటపడటం కలవరపెడుతోంది. మరోవైపు నిర్వహణ సమస్యలూ వెంటడుతున్నాయి.
నిర్వహణ సమస్యల కారణంగా జులై రెండో వారం వరకు తమ అంతర్జాతీయ విమాన సర్వీసులను 15 శాతం తగ్గించనున్నామని ఎయిరిండియా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 16 అంతర్జాతీయ మార్గాల్లో విమాన సర్వీసులను తగ్గించినట్టు కంపెనీ ప్రకటించింది. జూన్ 21 నుంచి జులై 15 వరకు ఈ సర్వీసుల తగ్గింపు కొనసాగుతుందని విమానయాన సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
రద్దయిన విమాన సర్వీసులు
* దుబాయ్-చెనై ఏఐ906
* ఢిల్లీ - మెల్‌బోర్న్ ఏఐ308
* మెల్‌బోర్న్ - ఢిల్లీ ఏఐ309
* దుబాయ్- హైదరాబాద్ ఏఐ2204
* పుణె- ఢిల్లీ ఏఐ874
* అహ్మదాబాద్- ఢిల్లీ ఏఐ456
*హైదరాబాద్-ముంబై ఏఐ2872
* చెన్నై- ముంబై ఏఐ571






