19-02-2026 02:18:49 AM
విలేకరుల సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్
గజ్వేల్, ఫిబ్రవరి18: మెదక్ ఎంపీ రఘునందన్ రావుపై నోటికి వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్న వంటేరు ప్రతాప్ రెడ్డి శిఖండి రాజకీయాలు మానుకోవాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ అన్నారు. బుధవారం గజ్వేల్ కు వచ్చిన ఆయన ఎంపీ రఘునందన్ రావు పై ప్రతాప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. మెదక్ పార్లమెంట్లో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న ఎంపీ రఘునందన్ రావుపై అరోపణలు చేయడం ఆకాశంపై ఉమ్మడం లాంటిదేనన్నారు.
బిజెపి కార్యకర్తలు తలుచుకుంటే ప్రతాప్ రెడ్డిని రోడ్డు మీద కూడా తిరుగనియమని హెచ్చరిస్తున్నామన్నారు. తూప్రాన్ లో ప్రతాప్ రెడ్డి వర్గానికి చెందిన అభ్యర్థి మున్సిపల్ చైర్మన్ కాలేదని అక్కస్సుతో మాట్లాడుతున్నారని, ప్రతాప్ రెడ్డి కూడా తమ వర్గానికి చెందిన అభ్యర్థిని చైర్మన్ చేయాలని ఎంపీ గారి దగ్గర కాళ్ళ బేరానికి వెళ్లినట్లు గుర్తు చేశారు. టిడిపి నుండి కాంగ్రెస్ లోకి, కాంగ్రెస్ నుండి బిఆర్‌ఎస్ లోకి మారి కేటీఆర్ దగ్గర డబ్బులు తీసుకుని హరీష్ రావు పై ఆరోపణలు చేయలేదా అని ప్రశ్నించారు.
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఈరోజు ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా వ్యాపారవేత్తగా అమ్మబడును కొనబడును అనే సంస్కృతిని పెంచి పోషించారన్నారు. ఫామ్ హౌస్ నుండి ఎన్నికల ఫండ్ తీసుకొచ్చి అభ్యర్థులకు అరకొర పంపిణీ చేసి మిగతా సొమ్ము ప్రతాపరెడ్డి లూటీ చేశారని ఆరోపించారు. గజ్వేల్ లో కెసిఆర్ ను ఓడగొట్టాలని హరీష్ రావు ఇస్తా అన్న డబ్బు సంచులపై ముందుగా కోట మైసమ్మ వద్ద చర్చ పెట్టాలని, అలాగే ఎంపీ రఘునందన్ రావు మూడు కోట్లు తీసుకున్నారన్న ఆరోపణలకు ఆధారాలు తీసుకురావాలని సవాల్ విసిరారు.
ఇప్పటికైనా శిఖండి రాజకీయాలు మానుకొని వెంటనే గౌరవ ఎంపీ శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు మనోహర్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడి పల్లి భాస్కర్, బిజెపి కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్, టెలికం బోర్డు మెంబర్ కమ్మరి శ్రీనివాస్, అసెంబ్లీ కో-కన్వీనర్ ఎల్కంటి సురేష్, బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నత్తి శివకుమార్, జిల్లా కౌన్సిల్ సభ్యులు చెప్యాల వెంకట్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి నాయిని సందీప్, బిజెపి నాయకులు పబ్బ శ్రీనివాస్, శ్రీరామ్ కృష్ణ, పుల్ల రాజు, గడియారం రాజేశ్వరి చారి తదితరులు పాల్గొన్నారు.