బీజేపీ ఈవీఎంలు!
ఓటింగ్ యంత్రాలకు బీజేపీ ట్యాగ్‌లు
బెంగాల్‌లో ధికార టీఎంసీ ఆరోపణ
కోల్‌కతా, మే 25: బెంగాల్‌లో మరో రాజకీయ రచ్చ మొదలైంది. పోలింగ్ కోసం వినియోగించేందుకు సిద్ధం చేసిన ఈవీఎంలకు బీజేపీ అని రాసి ఉన్న పేపర్ ట్యాగులు ఉన్నాయని తృణమూల్ కాంగ్రెస్ విమర్శించింది. బీజేపీ ట్యాగులు ఉన్న ఈవీఎంల ఫొటోలను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. బీజేపీకి అనుకూలంగా రిగ్గింగ్ జరుగుతున్నది అనేందుకు ఈ ఫొటో లే సాక్ష్యమని విమర్శించింది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది. ఈ ట్యాగులపై ఈసీ స్పందించింది. అవి బీజేపీ ట్యాగులు కావని బెంగాల్ సీఈఓ వివరణ ఇచ్చారు. పోలింగ్ బూత్‌లో వినియోగించే ముందు అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో వాటిని ప్రదర్శిస్తారని, ఆ సమ యంలో ఈవీఎంలకు ఉండే పేపర్ ట్యాగులపై పార్టీల ఏజెంట్ల హాజరుకు గుర్తుగా పార్టీ పేరును రాస్తారని వివరించారు. బీజేపీ ఏజెంటు ఒక్కరే హాజరైన సమయంలోని ఫొటోలను షేర్ చేశారని ఆరోపించారు. పోలింగ్ స్టేషన్ 56,58,60,61,62లో అన్ని పార్టీల ఏజెంట్లు హాజరయ్యి సంతకాలు చేసిన ట్యాగులను ఎన్నికల అధికారులు విడుదల చేశారు.






