తొలి ఐదు దశల ఓటింగ్ డాటా విడుదల
ఓటర్ టర్నింగ్ యాప్‌లో డేటా
సుప్రీంలో విచారణకు ముందే వెల్లడి
న్యూఢిల్లీ, మే 25 : లోక్‌సభ ఎన్నికల్లో తొలి ఐదు దశల్లో నమోదైన ఓటింగ్ శాతాన్ని భారత ఎన్నికల సంఘం (ఈసీ) శనివారం విడుదల చేసింది. తొలి విడతలో 66.14 శాతం, రెండో విడతలో 66.71 శాతం, మూడో విడతలో 65.68 శాతం, నాలుగో విడతలో 69.16 శాతం, ఐదో విడతలో 62.20 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. కాగా, పోలింగ్ జరిగిన 48 గంటల్లోపు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) వెబ్‌సైట్‌లో బూత్‌ల వారీగా ఓటర్ల సంఖ్య, పోలైన ఓట్ల సంఖ్య పెట్టాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై శుక్రవారం న్యాయస్థానం విచారణ చేపట్టి వాయిదా వేసింది. సుప్రీంలో విచారణ జరుగుతుండగానే ఈసీ తొలి ఐదు దశల పోలింగ్ డేటా విడుదల చేసింది. ఓటరు టర్నవుట్ యాప్‌లో డేటా అందుబాటులో ఉంటుందని తెలిపింది. కాగా, ఐదు విడతల్లో బూత్‌ల వారీగా పోలింగ్ డేటాను వెబ్‌సైట్‌లో పెట్టాల్సిందిగా ఈసీని ఆదేశించాలని ఏడీఆర్ వేసిన పిటిషన్‌పై శుక్రవారమే సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే, తాము ఈ విషయంలో ప్రస్తుత ఎన్నిక వేళ ఈసీకి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీం తెలిపింది. అయితే, ఈ విచారణ జరిగిన మరుసటి రోజే ఐదు విడతల్లో పోలైన ఓటింగ్ డేటాను ఈసీ విడుదల చేయడం గమనార్హం. ప్రతి దశలో పోలింగ్ రోజున ఉదయం 9.30 గంటల నుంచి బూత్‌ల వారీగా ఓటింగ్ పర్సంటేజ్ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.






