బీజేపీతో దేశానికి పెనుముప్పే
అది అడ్డుకునేందుకే కాంగ్రెస్ ప్రయత్నం
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఊహించని మార్పు
ఆరోగ్యారెంటీలే కాదు... ఇంకా చాలా ఉన్నాయి
నన్ను చూసి గడ్డం వంశీకి ఓటు వేయండి
గోదావరిఖని చౌరస్తాలో మంత్రి శ్రీధర్ బాబు
మంథని, మే6 (విజయ క్రాంతి): కేంద్రంలో బీజేపీతో దేశానికి పెను ముప్పు ఉన్నదని, దానిని అడ్డుకునేందుకే కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటి పథకాలన్నీ జూన్ 6 తర్వాత అమలవుతాయని స్పష్టంచేశారు. పెద్దపెల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా సోమవారం రాత్రి గోదావరిఖని కూరగాయల మార్కెట్ ప్రాంతంలో మంత్రి కార్నర్ మీటింగు నిర్వహించారు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్‌ఠాకూర్‌తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని పేర్కొన్నా రు. ఒక ప్రాంతం అభివృద్ధి జరగాలి అంటే అక్కడ ఓ పారిశ్రామికవేత్త ఉండాలని.. గడ్డం వంశీకృష్ణతో అది తీరుతుందని చెప్పారు. బీజేపీ ప్రభుత్వంతో ప్రమాదం ఉందని, ఆ ప్రమాదాన్ని ఓటుతో తిప్పి కొట్టాలని కోరా రు. బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఈ ప్రాంత ప్రజలకు తెలుసా? అని ప్రశ్నించా రు. బీజేపీ ప్రభుత్వంతో లబ్ధి పొందిన వారు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. అసలు ఈ ప్రాంత పరిస్థితులు తెలియని వ్యక్తి ఎన్నికల్లో నిలబడటం.. అది తనపై విమర్శ చేయడం హాస్యాస్పదంగా ఉన్నదని అన్నారు.
ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్న అభివృద్ధి జరగాలన్న కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటేనే సాధ్యమవుతుందని చెప్పారు. రామగుండం ఎరువుల కర్మాగారం ఇప్పుడు నడుస్తున్నదంటే అది గడ్డం వివేక్‌తోనే సాధ్యమైందని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి హయాంలో జూన్ 6 తర్వాత.. తెలంగాణలో అన్ని సంక్షేమ పథకాలు అమలు జరిగి పెను మార్పు జరుగుతుందని చెప్పారు. అనంతరం పెద్దపల్లిలో ఎమ్మెల్యే విజయ రమణారావు ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్‌బాబు గడ్డం వంశీకృష్ణ తరఫున ప్రచారం చేశారు.




