calender_icon.png 4 December, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భగ్గుమన్న బీజేపీ

04-12-2025 01:26:51 AM

హిందూదేవుళ్లపై సీఎం చేసిన వ్యాఖ్యలపై అందోళన 

గాంధీభవన్ వైపు దూసుకెళ్లిన బీజేపీ శ్రేణులు పోలీసులు, కార్యకర్తలమధ్య తీవ్ర తోపులాట 

కాంగ్రెస్ అరాచకాలకు భయపడం: రాంచందర్ రావు

హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): హిందూ దేవుళ్లపై సీఎం చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ర్టవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది. దాదాపు 129 ప్రాంతాల్లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఇందు లో భాగంగానే నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద బుధవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది.

హిందూదేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ మహిళా మోర్చా, యువ మోర్చా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ దిష్టిబొమ్మలు దహనం చేశారు. అయితే బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా గాంధీభవన్ వైపు ర్యాలీగా దూసుకెళ్లే క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది.

పీసీసీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేవైఎం రాష్ర్ట అధ్యక్షుడు గణేష్, బీజేపీ మహిళా మోర్చా రాష్ర్ట అధ్యక్షురాలు డా. మేకల శిల్పారెడ్డి నాయకత్వంలో బీజేవైఎం, మహిళా మోర్చా కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు.

పోలీసులు అడ్డుకునే సమయంలో జరిగిన తోపులాటలో పలువురాకా గాయాలయ్యాయి. శాంతియుత నిరసనకు కూడా అవకాశం ఇవ్వకుండా పోలీసుల దురుసుగా వ్యవహరించడం పట్ల బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు అరెస్టు చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలన్నారు. 

కార్యకర్తలపై పోలీసులతో దాడి: రాంచందర్ రావు

సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, బీజేవైఎం, బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతియుత నిరసన కార్యక్రమంపై కాంగ్రెస్ ప్రభుత్వమే పోలీసులను ఉపయోగించి దాడి చేయించడం దమనకాండకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే ఈ చర్యలను బీజేపీ తీవ్రంగా ఖండి స్తోందన్నారు.

అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తూ పోలీసులు ప్రదర్శించిన ఈ క్రూరత్వం ప్రజాస్వామ్య విలువలను అవమానించినట్లేనని, కాంగ్రెస్ అరాచకాలు, అక్రమ అరెస్టులు చూసి బీజేపీ భయపడదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హిందువుల గౌరవాన్ని కాపాడడం, ప్రజాస్వామ్య హక్కులను రక్షించడం కోసం బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. 

రేవంత్ రెడ్డి కాదు.. రేవంతుద్దీన్: శిల్పారెడ్డి

హిందూ దేవుళ్లపై వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డి.. రేవంతుద్దీన్ అని బీజేపీ తెలంగాణ రాష్ర్ట మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పారెడ్డి విమర్శించారు. ప్రశ్నిస్తే.. అక్రమ అరెస్టులు చేస్తారా? అని ప్రశ్నించారు. శాంతియుతంగా ర్యాలీగా బయలుదేరిన మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మహిళలని లాగడం, తోసేయడం, నేలకేసి పడేయడం వంటి అనుచిత చర్యలకు పాల్పడటంతో.. తమకు గాయలయ్యాయని తెలిపారు.

ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనకు అడ్డంకులు సృష్టించడం కాంగ్రెస్ ప్రభుత్వ అసహనానికి నిదర్శనమన్నారు. హిందువుల మనోభావాలను, గౌరవాన్ని, విశ్వాసాలను దెబ్బతీసేలా తాగుబోతులు, తిండిబోతులు, పరుషమైన ఉదాహరణలతో పోల్చడం అత్యంత బాధాకరమన్నారు. వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

పబ్లిసిటీ కోసమే : డీకే అరుణ

పబ్లిసిటీ కోసమే సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై హేళన చేస్తూ వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు. హిందువులపై కాంగ్రెస్ విషం చిమ్ముతోందని, హిందూ సనాతన ధర్మమంటే సర్వేజనా సుఖినోభవంతని, కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆమె హెచ్చరించారు. సీఎం వ్యాఖ్యలపై బుధవారం ఆమె ఒక ప్రకటనను విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు.

ఎన్నికలకు ముందు తానే గొప్ప హిందువునంటూ మాట్లాడిన రేవంత్ రెడ్డికి అధికారంలోకి రాగానే హిందువుల మనోభావాలను అవహేళన చేయడం సిగ్గు చేటన్నారు. కేసీఆర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి సైతం పబ్లిసిటీ కోసం హిందూ దేవుళ్లపై నోరు పారేసుకోవడం శోచనీయమని తెలిపారు.

అందరూ బాగుండాలని కోరుకునేదే హిందూ సనాతన ధర్మమన్నారు. అందులో భాగంగానే ప్రధాని మోదీ ఆధ్వర్యంలో సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ నినాదంతో ప్రతి ఒక్కరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు.