calender_icon.png 1 February, 2026 | 6:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్‌కు సిట్ నోటీసులు.. భగ్గుమన్న భారాస

01-02-2026 04:55:23 PM

మానకొండూరులో ధర్నా, రాస్తారోకో, దిష్టిబొమ్మ దహనం

సిట్ నోటీసులు ముమ్మాటికి కక్ష సాధింపే

మాజీ ఎమ్మెల్యే రసమయి భారాస జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు 

మానకొండూరు,(విజయక్రాంతి): ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని సిట్ మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం, విచారణ పై నిరసనగా మండల కేంద్రమైన మానకొండూరులో భారాస శ్రేణులు భగ్గుమన్నాయి పార్టీ మండలాధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం సిట్ నోటీసులు చట్ట విరుద్ధం, రాజ్యాంగ వ్యతిరేకం అంటూ వరంగల్, కరీంనగర్ ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో చేసి తమ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

నల్ల రిబ్బన్లు ధరించి సీఎం డౌన్ డౌన్, వీ వాంట్ జస్టిస్, కేసీఆర్ తో చెలగాటమా ఖబర్దార్, అంటూ నినాదాలతో హోరెత్తించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు భారాస శ్రేణులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పెనుగులాట, తోపులాట మధ్య దిష్టిబొమ్మను నాయకులు దహనం చేశారు. మండల పరిధిలోని గ్రామాల బీ ఆర్ఎస్ నాయకులు,  గ్రామాల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు హాజరై నిరసన తెలియజేశారు. 

పాలన చేతకాక సిట్  పేరిట వేధింపులు: మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, భారాస కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీ వీ రామకృష్ణారావు

ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, రసమయి బాలకిషన్, కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీ వీ రామకృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు కుంభకోణం, జలదోపిడిపై బీ ఆర్ఎస్ పార్టీ పోరాటాన్ని తట్టుకోలేక కుట్ర పన్ని హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ను విచారణ పేరిట వేధిస్తున్నారని మండిపడ్డారు.

నిరసన కార్యక్రమం అనంతరం మీడియాతో మానకొండూరులో మాట్లాడారు. ఉద్యమ నేత, రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అవమానించడం అంటే తెలంగాణ నేతలను అవమానించటమేనని అన్నారు. ఈ రాజకీయ వేధింపులకు జడిసి వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. చట్ట, న్యాయ పరిధిలోనే పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కారు కేసీఆర్ పై కక్షపూరిత వైఖరి అవలంబిస్తుందని రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.