calender_icon.png 7 December, 2025 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించేది బీజేపీ

07-12-2025 12:00:00 AM

  1. ఉల్లంఘించేది కాంగ్రెస్!
  2. అంబేద్కర్ స్మారకాలను పంచతీర్థాలుగా నిలిపిన ఘనత మోదీదే
  3. అంబేడ్కర్‌కు దక్కాల్సిన గుర్తింపునూ కాంగ్రెస్ ఇవ్వలేదు
  4. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు

హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించేది బీజేపీ అని, ఉల్లంఘించేది కాంగ్రెస్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం భారత ప్రజలందరికీ సమానత్వం, న్యాయం, మౌలిక హక్కులు అందించిందని, అయితే ఈ రాజ్యాంగాన్ని వరుసగా ఉల్లంఘించిన పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దాదాపు 60 సంవత్సరాలు దేశాన్ని పాలించిన సమయంలోనే, అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని అనేకసార్లు మార్చే ప్రయ త్నం చేసిందన్నారు.

ఎమర్జెన్సీ విధించి, మౌలిక హక్కులను తొక్కిన ఘనత కూడా కాంగ్రెస్‌కే సొంతమన్నారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ మహనీయుడి చిత్రపటానికి రాంచందర్‌రావుతో పాటు మరికొందరి నేతలు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.... అంబేద్కర్‌కు భారతరత్న ఇవ్వని పార్టీ -కాంగ్రెస్, 1955లో నెహ్రూకి, తర్వాత ఇందిరా గాంధీకి భారతరత్న ఇచ్చారు.

కానీ రాజ్యాంగ నిర్మాత, నిష్కళంక దేశభక్తుడు అంబేద్కర్‌కు మాత్రం దేశ అత్యున్న త పురస్కారం ఇచ్చే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. భారత రాజ్యాంగానికి, సామాజిక న్యాయ సంస్కరణలకు అంబేద్కర్ అసమానమైన కృషి చేసినప్పటికీ... కాంగ్రెస్ ఆయనకు దక్కాల్సిన గుర్తింపును ఇవ్వలేదని పేర్కొన్నారు. 1990లో బీజేపీ మద్దతుతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు మరణానంతరం భారతరత్న లభించిందని తెలిపారు. అంబేద్కర్ స్మారకాలను ‘పంచతీర్థా లు’గా నిలిపిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదే అన్నారు.

మహూలో అంబేద్కర్ భారీ స్మారక నిర్మాణం, నాగ్‌పూర్‌లో వారి జీవితానికి సంబంధించిన క్షేత్ర అభివృద్ధి, ముంబైలో స్మారక ప్రాజెక్టు, లండన్‌లో అంబేద్కర్ చదువుకున్న ఇంటిని భారత ప్రభుత్వం కొనుగోలు చేసి మెరుగైన లైబ్రరీగా ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇవన్నీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అంబేద్కర్ ఆలోచనలను ఎంత గౌరవిస్తుందో నిదర్శనమన్నారు. అంబేద్కర్ ఆలోచనలు దేశానికి శాశ్వత దిక్సూచని అన్నారు.

యువత ప్రాణాలు తీసుకోవద్దు

దళిత, -బీసీ వర్గాల కోసం పోరాడేది బీజేపీ అని, మాటలు చెప్పేది కాంగ్రెస్ అని ఆయన విమర్శించారు. అంబేద్కర్ సమానత్వం, సామాజిక న్యాయం కోసం పోరాడారని, అదే స్ఫూర్తితో బీజేపీ కూడా బడుగు, బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాడుతోందన్నారు. కానీ ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ చేసి ప్రజలను మోసం చేసిందన్నారు.

బీసీలకు అన్యాయం జరుగుతుందని బాధపడి బీసీ యువకుడు ఈశ్వర్ చారి ఆత్మహత్య చేసుకున్న ఘటన చాలా బాధాకరమన్నారు. ఆ యువకుడి కుటుంబానికి సంతాపాన్ని, పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. యువత రాష్ర్ట ప్రభుత్వం చేస్తున్న మోసాలను, అన్యాయంపై పోరాడండి, కానీ ప్రాణాలు తీసుకోవద్దని కోరారు.

బతికి పోరాడితేనే మార్పు తేవచ్చని, చావు కాదు, చైతన్యమే సమాజాన్ని మార్చుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ర్ట సంస్థాగత ప్రధానకార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ర్ట ప్రధాన కార్యదర్శులు డాక్టర్ గౌతంరావు, వేముల అశోక్, ఎస్సీ మోర్చా రాష్ర్ట అధ్యక్షుడు కాంతి కిరణ్, ఎస్సీ మోర్చా సీనియర్ నాయకులు చింతా సాంబమూర్తి, తదితర నాయకులు పాల్గొన్నారు.