calender_icon.png 7 December, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గడప గడపకు గజ్జలమ్మ పేరు

07-12-2025 12:00:00 AM

 నిర్మల్ డిసెంబర్ (విజయక్రాంతి);“ఆ ఊర్లోకి వెళ్లి గజ్జమ్మ అని పిలిస్తే చాలు... ఆ వాడలోని 10 మంది మహిళలు రోడ్లపైకి వస్తారు. గజేందర్ అంటే.. రోడ్డుపై ఉన్న పదిమంది ‘ఏమైంది’ అంటూ నిలుస్తారు. కులమేదైనా.. కుటుంబమేదైనా.. ప్రతి ఇంట్లో అయినా, వ్యాపారమైనా.. షాపైనా.. ప్రారంభమేదైనా ‘గ’ ప్రతిధ్వనించాల్సిందే.. గ్రామంలోనైనా.. విదేశాల్లోనైనా పిల్లలు పుట్టినా గజ్జలమ్మను స్మరించాల్సిందే.. ఇలా అందరి పేర్లునా.. ఇంకేదైన తలపెట్టినా ‘గ’తో మొదలవ్వాల్సిందే. ఆ గ్రామం గమనై.. జననాదమై.. గజ్జలమ్మ నామస్మరణై మార్మోగుతున్నది నిర్మల్ జిల్లా కుంటాల మండలం. ఇంత ఘన చరిత్ర గల ఆ ఊరి విశేషాలు, 200 ఏండ్లుగా కొనసాగుతన్న ఆచారం తెలుసుకుందాం పోదాం పదా...!!”

నిర్మల్ జిల్లా కుంటల మండల కేంద్రంలో ఉన్న పేర్ల చరిత్ర వింటే ఆశ్చర్యపోతున్నారు కదూ.. నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో వెలసిన గజ్జలమ్మ దేవత పేరు మీద ప్రతి ఇంట్లో పుట్టిన బిడ్డలకు సంప్రదాయంగా ‘గ’ అనే అక్షరంతో మొదలయ్యే పేర్లను నామకరణం చేస్తూ 200 సంవత్సరాలుగా సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. 200 సంవత్సరాల క్రితం గ్రామంలో కలరా, డయేరియా, మసూచి వ్యాధులు సంక్రమించి పుట్టిన పిల్లలు పుట్టినట్టే చనిపోయేవారు.

అప్పట్లో వైద్యం లేకపోవడంతో దేవుడిపై భారం వేసేవారట. అప్పటి ప్రజలు ఎన్నెన్నో దేవుళ్లకు మొక్కి తమ పిల్లలను కాపాడాలని వేడుకున్నారట. గ్రామంలో ముత్తన్న అనే వ్యక్తి అర్ధరాత్రి బయటకు రాగా ఓ పాడుబడ్డ ఊట బావిలో నుంచి భూశబ్దం వచ్చింది. శబ్దాన్ని అనుకరిస్తూ ఆయన అక్కడికి వెళ్లగా ‘నేను గజ్జలమ్మని. నన్ను ఇక్కడ ప్రతిష్టిస్తే గ్రామంలో ప్రజలకు ఏ రోగాలూ రావు. రక్షణ ఉంటా’ అనడంతో ఆయన ఊర్లో అందరికీ చెప్పాడు. తర్వాత గజ్జలమ్మ విగ్రహ ప్రతిష్టాపన చేశారట. ఊరు వారందరూ తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవతను మొక్కుతారు. తమకు పుట్టబోయే పిల్లలకు గజ్జలమ్మ పేరు పెట్టుకుంటామని  కోరుతారు. దీంతో ఊర్లో వ్యాధులు నయమై పిల్లలు క్షేమంగా మారారట. అప్పటి నుంచి ఇప్పటివరకు గ్రామంలో ఎవరి ఇంట్లోనైన సంతానం కలిగితే గజ్జలమ్మ పేరు మీద ‘గ’ అక్షరంతో పేర్లు పెట్టుకుంటూ వస్తున్నారు

ఆ ఊర్లో పేర్లన్నీ అమ్మ పేరు పైనే..

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో 200 సంవత్సరాల నాటి గజ్జలమ్మ పేరుని నామకరణం చేస్తున్నారు. గ్రామంలో మొత్తం 800 కుటుంబాలు ఉండగా 3000 వరకు జనాభా ఉంటుంది. ఇందులో 500 కుటుంబాల్లో ‘గ’ అనే అక్షరంతో తమ పిల్లలకు ఇప్పటికీ పేర్లు పెడతారు. వివిధ కులాలకు చెందిన కుటుంబీకులు ఇంటి పేరుతోపాటు అన్నాముల పేర్లు అక్కాచెల్లెళ్ల పేర్లు అందరి పేర్లు కూడా ‘గ’ అక్షరం తోనే ఉంటాయి. ఇందులో గజ్జరం గజేందర్ గజ్జవ్వ గాయత్రి, గోదావరి గంగామణి, గణపతి గంగోత్రి, గజ్జమ్మ గంగమ్మ, గంటన్న తదితర పేర్లు ఉంటాయి. ఒక్క ఇంటిలో ముగ్గురు పిల్లలు ఉంటే పెద్ద గజరామ్ చిన్నగజరామ్, నడిపి గజ్జరామ్ అని పేర్లు పెట్టుకుంటున్నారు. ఆడవారి పేర్లలో పెద్ద గజమ్మ, చిన్న గజ్జమ్మ, నడిపి గజ్జమ్మతోపాటు కులాల పేరుతో ప్రారంభం అవుతాయి. ముందుగా కులంపేరు తర్వాత గజ్జరాములు గా పిలుస్తారు. ‘గ’ అక్షరంతో గ్రామంలో 3వేల జనాభాలో ౨వేల  పేర్లుంటాయని తెలుపుతున్నారు. గ్రామం లో ఏ వ్యాపారమైనా, షాపులైనా గజ్జలవ్వ పేరుతో ప్రారంభిస్తారు. 

ప్రతి సంవత్సరం వేడుకలు

కుంటాల మండల కేంద్రంలోని గజ్జలమ్మ ఆలయంలో ప్రతి ఆదివారం అమ్మవారికి బోనాలను సమర్పించుకుంటారు. నిర్మల్ జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర, నిజామా బాద్, జగిత్యాల్, అదిలాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ప్రతేటా ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటున్నారు. చదువుల కోసం ఉద్యోగుల కోసం ఇతర ప్రదేశాలకు వేరే దేశాలకు వెళ్లి స్థిరపడిన వారు ఏడాదిలో ఒకసారి ఇక్కడికి వచ్చి బోనాలు సమర్పించుకుంటారు. విదేశాల్లో ఉన్న వారు సైతం అక్కడ పిల్లలు పుట్టినా ఫస్ట్ అమ్మవారి పేరుతోనే పిలిచి, తర్వాత నచ్చిన పేర్లను పెట్టుకుంటున్నారు. గతంలో పురాతన ఆలయం ఉండగా, ప్రభుత్వం 50 లక్షలతో కొత్త ఆలయాన్ని నిర్మించింది. ప్రతి ఆదివారం వేలాది భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. 

ఆ ఊర్లో ఏ శుభకార్యం చేయాలన్నా మొదట గజ్జలమ్మకు ముడుపులు పూజలు నిర్వహించాల్సిందే. తర్వాతనే.. పెండ్లీలు, గృహప్రవేశాలు, వ్యాపార దుకాణాలు ప్రారంభించడం సంప్రదాయం గా వస్తోంది. రైతులు పంటేసుకోవాల న్నా.. ఎత్తుకోవాలన్నా మొదట గజ్జలమ్మకు పూజలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో వార్షికోత్సవం, సామూహిక బోనాలు నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ వేడుకలకు ఆ ఊరిలో పుట్టిన ఆడపడుచులు అత్తవారి ఇంటి నుంచి సొంత గ్రామానికి చేరుకొని మూడు రోజులపాటు అక్కడే ఉండి అమ్మవారి ఆశీర్వాదంతో తిరిగి వెళ్తారు. ఓటర్ లిస్టు, ప్రభుత్వ పాఠశాలలో పేర్లను పరిశీలిస్తే అన్నీ ‘గ’తో మొదలయ్యారు.