06-12-2025 06:39:24 PM
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అజెండాను ఖరారు చేసింది. ఈ సందర్భంగా మీర్‌ఖాన్‌పేటలోని ఫ్యూచర్ సిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సందర్శించారు. ప్యూచర్ సిటీ వేదికగా ఈనెల 8,9వ తేదీలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక “తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ -2025” ఆర్థిక సదస్సు ఏర్పాట్లను సహచర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబుతో కలిసి ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అంతర్జాతీయ ఆర్థిక సదస్సును ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికను కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే సిద్ధం చేసింది.
రెండ్రోజుల సదస్సులో వివిధ అంశాలపై 27 ప్రత్యేక సెషన్లు జరుగనున్నట్లు సమాచారం. ఈ సదస్సులో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు రానున్నారు. అలాగే ఈనెల 9న సాయంత్రం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ డాక్యుమెంట్ ఆవిష్కరించి, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్ మ్యాప్ ప్రకటిస్తారు. ఈ సదస్సులో పలువురు క్రీడాకారులో పీవీ సింధు, గోపీచంద్, గుత్తా జ్వాల, గగన్ నారంగ్, అనిల్ కుంబ్లే, సీనీ ప్రముఖుల్లో రాజమౌళి, రితేష్ దేశ్ ముఖ్, సుకుమార్, గుణీత్ మోంగా, అనుపమా చోప్రా పాల్గొననున్నారు.