calender_icon.png 19 July, 2025 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిజెపి, ఆర్ఎస్ఎస్ మతతత్వ విధానాలు దేశానికి ప్రమాదకరం

18-07-2025 08:33:38 PM

ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలం

సీతారామ ప్రాజెక్టు నీళ్లు తరలింపులో ఇల్లందు ఏజెన్సీకి అన్యాయం

సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజా పంథా) జాతీయ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాగూర్

ఇల్లందు టౌన్ జులై18(విజయక్రాంతి): దేశంలో ఆర్ఎస్ఎస్, బిజెపి అనుసరించే మత ఆధిపత్య ధోరణులు దేశానికి ప్రమాదకరమని సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా)జాతీయ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాగూర్,  రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్యలు అన్నారు. ఇల్లందు పట్టణం చండ్ర కృష్ణమూర్తి మెమోరియల్ ట్రస్ట్ భవన్ లో శుక్రవారం సిపిఐ (ఎంఎల్) ప్రజాపంద రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చండ్ర అరుణ అధ్యక్షతన నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దేశానికి మత చాయాలు అలుముకొని యూనివర్సిటీలకు, భిన్న మతాలకు, మీడియాకు, రాజకీయ అభిప్రాయాలకు, స్వేచ్ఛ లేకుండా ఒకే మతం, ఒకే జాతి, ఒకే దేశం అంటూ హిందుత్వ దేశంగా మార్చేందుకు ప్రజాస్వామ్య విలువలపై భారత రాజ్యాంగం పై దాడులు  చేస్తున్నారన్నారు.

ప్రజాస్వామిక ఉద్యమాలపై ఉక్కు పాదం మోపి స్వేచ్ఛను కోరుకున్న వారిని టార్గెట్ చేస్తూ అర్బన్ నక్సలైట్ ముద్ర వేసి నిర్బంధిస్తున్నారన్నారు. బీజేపీ మతతత్వ విధానాలపై దేశ ప్రజలు సంఘటితంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 420 హామీలను మేనిఫెస్టోలో పెట్టి ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని, ఏడవ గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామని అధికారంలోకి వచ్చి, ప్రకటించిన హామీలను అమలు చేయకుండా ఘోరంగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో రేషన్ కార్డులను నిరుపేదలకు అందించకుండా, బ్రోకర్లకు అవకాశాలు కల్పించి భారీ అవినీతి అక్రమాలకు తెర లేపారాను. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇండ్లను ఇవ్వడం అన్యాయమన్నారు.

రాష్ట్రంలో రాజకీయ వాతావరణం చూస్తే ముఖ్యమంత్రి నుండి మొదలుకొని ప్రతిపక్ష నేత కేటీఆర్ వరకు బాధ్యతగా మాట్లాడేటువంటి వైఖరిని వదిలేశారని, నేలబారు రాజకీయాలు చేయడం, మాట్లాడడం అనేటువంటిది ఒక విధానంగా పెట్టుకున్నారని, రాజకీయ విధానాలు గౌరవప్రదంగా ఉండాల్సింది పోయి, ప్రజలు అసహ్యించుకునే విధంగా పరస్పరం ద్వేషించుకుంటున్నారని అన్నారు. ఇది రాజకీయ విలువలకు విఘాతం కలుగుతుందని  వారు తెలిపారు. 

జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని, అధికార పార్టీ ప్రలోభాలకు కానీ, అధికార పార్టీ వర్గీయులకులోను కాకుండా, డబ్బు ప్రలోభాలకు లోను కాకుండా ప్రజాస్వామ్యానికి అద్దం పట్టేలా నిర్వహించాలని వారన్నారు. సీతారామ ప్రాజెక్టు నీళ్ల తరలింపును వ్యతిరేకిస్తూ అనేక ఉద్యమాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టింపు లేకుండా వ్యవహరిస్తుందని సీతారామ ప్రాజెక్టు ను రీ డిజైన్ పేరుతో ఇల్లందు, గార్ల ,బయ్యారం, మహబూబాబాద్ ఏజెన్సీ ప్రాంత ప్రజలకు నీళ్లు రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. సీతారామ ప్రాజెక్టును పాత డిజైన్ ప్రకారమే నిర్మాణం చేసి ఈ ప్రాంత ప్రజలకు నీళ్లు అందించాలని, లేనియెడల ఈ ప్రాంత ప్రజలని సమీకరించి బలమైన ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.