బీజేపీ క్లీన్‌స్వీప్ పక్కా

23-04-2024 02:39:44 AM

400 సీట్లు సాధించడం ఖాయం l మోదీ, బీబీ పాటిల్ గెలుపు తథ్యం

2047నాటికి వికసిత్ భారతే లక్ష్యం l కేంద్రమంత్రి పీయూష్ గోయల్ 

సంగారెడ్డి, ఏప్రిల్ 22 (విజయ క్రాంతి): పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 400పైగా సీట్లు సాధిస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. సోమవారం సంగారెడ్డిలో జహీరాబాద్ లోకసభ బీజేపీ అభ్యర్థి బీబీపాటిల్ నామినేషన్‌లో పాల్గొని అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసగించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ పాలనలో ప్రతి కుటుంబానికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు.

2047నాటికి వికసిత్ భారతే లక్ష్యమన్నారు. ప్రధానమంత్రి మోదీ హవాతో పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 500 సంవత్సరాల పోరాటం తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేసి శ్రీరాముని ప్రాణప్రతిష్ట చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో గత బీఆర్‌ఎస్ పాలనకు, ఇప్పటి కాంగ్రెస్ పాలనకు తేడాలేదన్నారు. 

ప్రజలు  తెలంగాణలో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీబీపాటిల్‌ను భారీ మోజర్టీతో గెలుపించాలన్నారు.  బీబీ పాటిల్ ప్రజల ఆశీర్వాదంతో హ్యాట్రిక్ విజయం సాధిస్తారని కేంద్ర మంత్రి గోయల్ అన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట్ రమణరెడ్డి, సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, బీజేపీ నాయకుడు చీకోటిప్రవీణ్, జహీరాబాద్ మాజీ సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, గోవర్ధన్‌రెడ్డి, పాండురంగారెడ్డి, భూమయ్య, దేశేట్టిపాటిల్‌తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  

 సంగారెడ్డిలో భారీ ర్యాలీ

 సంగారెడ్డి కలెక్టరేట్‌లో జహీరాబాద్ బీజేపీ అభ్యర్థిగా బీబీ పాటిల్ నామినేషన్ దాఖలు చేసి ప్రధాన రోడ్డు వెంట భారీ ర్యాలీ నిర్వహించారు.