14 May, 2026 | 5:34 AM

ఆ మూడింటిపై వీడని ముడి

23-04-2024 02:38 AM

l ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ అభ్యర్థులపై కాంగ్రెస్ దాగుడుమూతలు 

l కరీంగనర్‌లో వెలిచాల నామినేషన్! 

l హాజరైన మంత్రి పొన్నం, ఎమ్మెల్యేలు 

l అలిగిన మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి

l ఖమ్మం టికెట్ పొంగులేటి వియ్యంకుడికే

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో మూడు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే విషయంలో కాంగ్రె స్ అధిష్ఠానం దాగుడుమూతలాడుతున్నది. నామినేషన్ల గడవు ఇంకా రెండు రోజులే మిగిలి ఉన్నా టికెట్లు ఖరారు చేయలేదు. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠ పెరిగిపోతున్నది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను కాంగ్రెస్ అధిష్ఠానం 14 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. వాళ్లు నామినేషన్లు వేసి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలకు మాత్రం ఇంకా అభ్యర్థు లను ప్రకటించలేదు. ఖమ్మం, కరీంనగర్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉన్నది. ఇక్కడ బీజేపీ, బీఆర్‌ఎస్ నుంచి పోటీ కూడా తీవ్రంగానే ఉన్నది. దీంతో పార్టీ అధిష్ఠానం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తున్నది. హైదరా బాద్‌లో మజ్లిస్‌కు ఇబ్బంది కలగకుండా డమ్మీ అభ్యర్థిని నిలబెట్టాలనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. 

వెలిచాలకే అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్?  

కరీంనగర్ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, పార్టీ సీనియర్ నేత వెలిచాల రాజేందర్‌రావు పోటీ పడుతున్నారు. ప్రవీణ్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ టికెట్ ఆశించారు. కానీ, ఆ సీటును మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఇచ్చి.. కరీంనగర్ ఎంపీ టికెట్  ప్రవీణ్‌రెడ్డికి ఇస్తామని పీసీసీ నాయకత్వం హామీ ఇచ్చింది. ఇప్పుడు వెలిచాలకు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.  వెలిచాల పేరు అధిష్ఠానం అధికారికంగా ప్రకటించకపోయినా.. సోమవారం ఆయన నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు సత్యనారాయణ, సత్యం హాజరుకావడంతో వెలిచాలకే టికెట్ ఖరారైందని పార్టీ నేతలు చెప్తున్నారు. దీంతో అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పార్టీ కార్యక్రమాలక దూరంగా ఉన్నట్టు సమాచారం. 

ఖమ్మం టికెట్ రామసహాయానికి?

ఖమ్మం అభ్యర్థి ఎంపిక కూడా ఖరారైందని పార్టీ నేతలు చెప్తున్నారు. బెంగళూరు కేంద్రంగా పార్టీ ట్రబుల్ షూటర్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోమవారం భట్టి, పొంగులేటితో చర్చలు జరిపి ఒక పేరును అధిష్ఠానానికి పంపారని తెలుస్తోంది. పొంగులేటి వియ్యంకుడైన రామసహాయం రఘురాంరెడ్డికి టికెట్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. ఆ స్థానాన్ని వదులుకొన్నందుకు భట్టికి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. రామసహాయం మంగళవారం ఉదయం ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నట్టు తెలిసింది.

నేడు అభ్యర్థులను ప్రకటించే అవకాశం

ఈ మూడు స్థానాలకు మంగళవారం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నదని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని అంటున్నారు. కరీంనగర్ అభ్యర్థికి అంతర్గతంగా సమాచారం ఇవ్వడంతోనే నామినేషన్ వేశారని.. ఖమ్మం, హైదరాబాద్‌పై మంగళవారం క్లారిటీ ఇస్తారని నేతలు చెప్తున్నారు.