13 March, 2026 | 4:38 AM

వంటగదికి బ్లాక్‌మార్కెట్ ఉచ్చు!

13-03-2026 12:25 AM

వెంకగారి భూమయ్య :

* డిజిటల్ ఇండియా అని గొప్పలు చెప్పుకుంటున్న తరుణంలో కూడా ఒక సిలిండర్ డెలివరీని పారదర్శకంగా ట్రాక్ చేయలేకపోవడం మన పాలనా వ్యవస్థ వైఫల్యానికి అద్దం పడుతోంది. నల్లబజారు వ్యాపారులు కేవలం భయాన్నే పెట్టుబడిగా మార్చుకొని సామాన్యుడి పొయ్యి వెలగకుండా అడ్డుపడుతున్నారు. 

భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశ ఆర్థిక వ్యవస్థలో గ్యాస్, ఇంధన భద్రత అనేది కేవలం ఒక ఆర్థికపరమైన అంశం మాత్రమే కాదు. అది సామాజిక స్థిరత్వానికి, రాజకీయ మనుగడ కు అత్యంత సున్నితమైన అంశం. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఎల్పీజీ సంక్షోభం, దాని వెంటే నీడలా వస్తున్న నల్లబజారు అరాచకా లు గమనిస్తే మనం మళ్లీ 1970ల నాటి ఆ చేదు జ్ఞాపకాల్లోకి, అంటే కొరత కాలంలోకి వెళ్తున్నామా.. అన్న బలమైన అనుమానం కలుగుతున్నది.

అధికారిక గణాంకాలు గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం ఎన్ని రంగుల మాట లు చెబుతున్నా క్షేత్రస్థాయిలో సామాన్య వినియోగదారులు పడుతున్న అవస్థలు భయంకరంగా ఉన్నాయి. రెట్టింపు ధరలకు సిలిండర్లు అమ్ముడవుతున్న తీరు ఒక చేదు నిజాన్ని మన ముందు ఉంచుతున్నది. హోర్ముజ్ జలసంధి వంటి అంతర్జాతీయ సరఫరా మార్గాల్లో ఏర్పడిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దేశీయంగా గ్యాస్ నిల్వలపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి.

కొత్త సరఫరాదారులను వెతకడంలో జరుగుతున్న ఆలస్యం ఈ సమస్యను మరింత జటిలం చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం వాణిజ్య వంటశాలల కు సరఫరాను నియంత్రించి కేవలం గృహ అవసరాలకు ప్రాధాన్యమివ్వాలని తీసుకు న్న నిర్ణయం సిద్ధాంతపరంగా బాగున్నా ఆచరణలో అది పెను విపత్తుకు దారితీసింది.

రెస్టారెంట్లు.. ఉపాధికి మూలం

నేటి ఆధునిక కాలంలో హోటళ్లు, రెస్టారెంట్లంటే కేవలం (స్టార్ హోటళ్లను మినహా యిస్తే) కేవలం అవి విందుశాలలే కాదు.. అవి లక్షలాది మంది కార్మికులకు ఉపాధిని స్తూ, ప్రతిరోజూ కోట్లాది మంది సామాన్యులకు, విద్యార్థులకు, వలస కూలీలకు చౌకగా ఆహారాన్ని అందించే రంగాలు. వీరికి చట్టబద్ధంగా గ్యాస్ అందనప్పుడు వారు తమ మనుగడ కోసం అక్రమ మార్గాలను ఆశ్రయించడం అనివార్యం అవుతుంది.

ఫలి తంగా గృహ వినియోగదారులకు అందాల్సి న రాయితీ సిలిండర్లు దొడ్డిదారిన నల్లబజారుకు మళ్లుతున్నాయి. ఇక్కడ గమనించా ల్సిన విషయం ఏమిటంటే ఒక వస్తువుకు డిమాండ్ ఎక్కువగా ఉండి సరఫరా తక్కువగా ఉన్నప్పుడు మార్కెట్ తనంతట తాను గా ఒక ధరను నిర్ణయించుకుంటుంది. దీనినే ఆర్థిక పరిభాషలో ‘స్కేర్సిటీ ప్రీమియం’ అంటారు. ప్రభుత్వం ధరలను కృత్రిమంగా నియంత్రించినప్పుడు, ఆ వస్తువు బహిరంగ మార్కెట్ నుంచి మాయమై అక్రమ మార్కెట్లోకి ప్రవేశిస్తుంది.

అక్కడ విక్రేతలు పట్టుబ డితే జైలు శిక్ష లేదా భారీ జరిమానాలు ఉంటాయనే భయంతో ఆ భయాన్ని కూడా క్యాష్ చేసుకుంటూ రిస్క్ ప్రీమియాన్ని అస లు ధరకు కలుపుతున్నారు. దీనివల్ల సామాన్యుడు ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే దాదాపు రెట్టింపు మొత్తాన్ని వెచ్చించి బ్లాక్ మార్కెట్లో సిలిండర్ కొనాల్సి వస్తోంది.

50 ఏళ్ల క్రితం

గతంలో 1970, 80వ దశకాల్లో ఇలాం టి వికృతమైన రేషన్ సంస్కృతిని చూశా ము. అప్పట్లో ఒక ఎల్పీజీ కనెక్షన్ కోసం లేదా ఒక స్కూటర్ కోసం ఆడపిల్ల పుట్టినప్పుడే బుక్ చేసి ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. 1990ల ఆర్థిక సంస్కరణల తర్వాత అటువంటి చీకటి పరిస్థితుల నుంచి మనం బయటపడి స్వేచ్ఛా మార్కెట్‌లోకి అడుగుపెట్టాం. దురదృష్టవశాత్తు 2026లో కూడా మళ్లీ అలాంటి పరిస్థితులు తలెత్తడం పాలకుల వైఫల్యమే.

కేవలం సరఫరాలో అంతరా యం ఏర్పడటం మాత్రమే ఈ సమస్యకు కారణం కాదు. మార్కెట్ వ్యవస్థలో ప్రభు త్వం అతిగా జోక్యం చేసుకుంటూ వాస్తవాలను విస్మరించడం కూడా ఈ సమస్యను మరింత పెంచుతున్నది. ప్రభుత్వం ఎంత కఠినంగా నిఘా పెంచితే నల్లబజార్‌లో రిస్క్ పెరుగుతుంది. తద్వారా ధరలు మరింత ఆకాశాన్ని తాకుతాయి తప్ప సామాన్యుడికి ఒరిగేదేమీ లేదు.

ఈ అక్రమ రవాణా వెనుక  దళారులు, గ్యాస్ ఏజెన్సీలు, అధికారుల అపవిత్ర కూటమి ఉందనేది బహిరంగ రహస్యం. ప్రస్తుతం దేశీయంగా గ్యాస్ నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడంలో మనం విఫలమయ్యామనే చెప్పాలి. నిల్వలు నిండుకో వడంతో ఏజెన్సీల వద్ద వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత పెరుగుతోంది. బుక్ చేసిన వారం పది రోజులైనా సిలిండర్ ఇంటికి రాకపోవడంతో సామాన్యుడు దిక్కుతోచని స్థితిలో బ్లాక్ మార్కెట్ వైపు చూస్తున్నాడు.

గడ్డు కాలం నుంచి బయటపడలాంటే

ఈ గడ్డు కాలం నుంచి బయటపడటానికి ప్రభుత్వం కేవలం అణిచివేత ధోరణిని వీడి సాహసోపేతమైన, వాస్తవికమైన అడుగులు వేయాల్సి ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో కొత్త సరఫరాదారులను వెతకడంతో పాటు దేశీయంగా గ్యాస్ ఉత్పత్తిని పెంచడంపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. గ్యాస్ ధరలను పెంచడం రాజకీయంగా ఇబ్బందికరమైన నిర్ణయమే కావచ్చు. నల్లబజారులో అక్రమార్కుల జేబులు నింపడం కంటే ఆ అదనపు ఆదాయం ప్రభుత్వ రంగ సంస్థలకు చేరడం ఉత్తమం.

దీనివల్ల ఆ సంస్థలకు ఆర్థిక వెసులుబాటు కలిగి వారు మరింత గ్యాస్ను దిగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. ఎల్పీజీ ధర పెరిగినంత మాత్రాన డీజిల్ తరహాలో రవాణా ఖర్చు లు పెరిగి దేశవ్యాప్త ద్రవ్యోల్బణం రాదు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి గ్యాస్ ఏజెన్సీల వద్ద ఉన్న నిల్వల వివరాలను, పంపిణీ సమాచారాన్ని ప్రజలందరికీ తెలిసేలా ఆన్లైన్ డ్యాష్బోర్డ్లను ఏర్పాటు చేయాలి. ప్రతి సిలిండర్ ఎక్కడికి వెళ్తుందో ట్రాక్ చేసే పకడ్బందీ వ్యవస్థ ఉండాలి. పారదర్శకత ఉన్న చోట అవినీతి, నల్లబజారు మనుగడ సాగించలేవు.

వ్యవస్థీకృత అక్రమాలు

ప్రస్తుత సంక్షోభం కేవలం సరఫరా కొర త వల్ల వచ్చింది మాత్రమే కాదు. దీని వెనుక వ్యవస్థీకృతమైన అవినీతి యంత్రాంగం పనిచేస్తోంది. గ్యాస్ ఏజెన్సీల వద్ద కృత్రిమ కొర తను సృష్టించి సాధారణ పౌరులకు అందాల్సిన గ్యాస్ సిలిండర్లను రహస్యంగా వాణి జ్య అవసరాలకు మళ్ళిస్తున్నారు. ఈ దందా లో కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు ఒక గొలుసుకట్టులా ఏర్పడి నల్లబజారును ప్రోత్సహిస్తున్నారు. ప్రభు త్వం నిర్వహిస్తున్న దాడులు కేవలం కంటితుడుపు చర్యలుగానే మిగిలిపోతున్నాయి.

నిఘా పెరిగిన ప్రతిసారీ బ్లాక్ మార్కెట్లో సిలిండర్ ధర పెరుగుతోందే తప్ప సామాన్యుడికి సరైన సమయానికి డెలివరీ అంద డం లేదు. డిజిటల్ ఇండియా అని గొప్పలు చెప్పుకుంటున్న తరుణంలో కూడా ఒక సిలిండర్ డెలివరీని పారదర్శకంగా ట్రాక్ చేయలేకపోవడం మన పాలనా వ్యవస్థ వైఫల్యానికి అద్దం పడుతోంది. నల్లబజారు వ్యాపారులు కేవలం భయాన్నే పెట్టుబడిగా మార్చుకొని సామాన్యుడి పొయ్యి వెలగకుం డా అడ్డుపడుతున్నారు. ఈ అపవిత్ర కూటమిని విచ్ఛిన్నం చేయని పక్షంలో సామాన్యు డికి ఆర్థిక కష్టాలు మరింతగా పెరుగుతాయి.

అంతర్జాతీయ ఉద్రిక్తతలే కారణం

ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు భారత ఇంధన మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు, సముద్ర మార్గాల్లో రవాణాకు ఎదురవుతున్న అవరోధాలు గ్యాస్ దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారత్ తన గ్యాస్ సిలిండర్ అవస రాల్లో సుమారు 50 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతున్న నేపథ్యంలో ఇటువంటి అంతర్జాతీయ సంక్షోభాలు వచ్చినప్పుడు సామాన్యుడు బలిపశువు అవుతు న్నాడు.

ప్రభుత్వం కేవలం రాయితీల మీద దృష్టి పెట్టడమే కాకుండా దేశీయంగా నిల్వ సామర్థ్యాన్ని యుద్ధ ప్రాతిపదికన పెంచాల్సి ఉంది. గ్యాస్ సిలిండర్ నిల్వలు లేకపోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో చిన్న మార్పు వచ్చినా,అది సామాన్యుడి వంటగదిపై పెను ప్రభావం చూపుతోంది. కేవలం పొరుగు దేశాలతో ఒప్పందాల మీద కాకుండా సొంత వనరుల అన్వేషణ, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు మళ్లడం ఇప్పుడు అత్యవసరం. లేనిపక్షంలో విదేశీ రాజకీయ ఉద్రిక్తతలు మన దేశంలోని సామాన్యుడి ఆకలిని శాసించే ప్రమాదం ఉంది.

 వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు 

సెల్: 9848559863