9 June, 2026 | 1:19 AM

జూపల్లి చెరువులో నల్లమట్టి దందా!

09-06-2026 12:00 AM
  1. అనుమతులు లేకుండానే యథేచ్ఛగా తవ్వకాలు
  2. అధికార పార్టీ కౌన్సిలర్ బట్టీలకు మట్టి తరలింపు
  3. జేసీబీ, టిప్పర్లను అడ్డుకుని పోలీసులకు అప్పగించిన రైతులు
  4. రాజకీయ ఒత్తిళ్లతో వాహనాలను విడిచిపెట్టిన పోలీసులు?
  5. సామాన్యులకో న్యాయం.. అధికార పార్టీ నేతలకో న్యాయమా?

చారకొండ, జూన్ 8:  ప్రభుత్వ నిబంధనలు గాల్లో దీపాలు.. అధికారుల నిఘా శూన్యం.. వెరసి అక్రమార్కుల పాలిట చింత చెరువు కాసుల కురిపించే గనిగా మారింది. చారకొండ మండలం జూపల్లి గ్రామ శివారులోని చింత చెరువు నుంచి నల్లమట్టిని యథేచ్ఛగా తవ్వి తరలిస్తూ ప్రకృతి సంపదను దోచేస్తున్నారు. గత రెండు రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా రాత్రి వేళల్లో సాగిన ఈ నల్ల మట్టి దందా.. సోమవారం నాటికి మరింత శృతిమించి పట్టపగలే జేసీబీలు, టిప్పర్లతో బహిరంగంగా సాగింది. కల్వకుర్తి మున్సిపాలిటీకి చెందిన అధికార పార్టీ కౌన్సిలర్ ఒకరు తన ఇటుక బట్టీల కోసం ఈ మట్టిని అక్రమంగా తరలిస్తున్నట్లు గ్రామస్థులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.

సామాన్యులపై ప్రతాపం.. నేతలకు సలాం!

మండలంలో రెవెన్యూ, పోలీస్ అధికారుల తీరుపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్య రైతులు తమ పొలాల బాగు కోసం కొద్దిగా మట్టిని తరలిస్తే చాలు.. అనుమతుల పేరిట హడావుడి చేస్తూ కేసులు, జరిమానాలతో ప్రతాపం చూపే అధికారులు.. అధికార పార్టీ నేతల అక్రమాల ముందు మాత్రం మోకరిల్లుతున్నారని మండిపడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా, పట్టపగలే జేసీబీలు, టిప్పర్లతో భారీ ఎత్తున చెరువును తవ్వేస్తుంటే కనీసం పట్టింపు లేనట్లు వ్యవహరించడం అధికారుల పక్షపాత వైఖరికి అద్దం పడుతోంది.

పంట పొలాలకు కోత ముప్పు!

చెరువులో భారీ యంత్రాలతో ఇష్టారాజ్యంగా, అధిక లోతులో తవ్వకాలు జరపడం వల్ల సమీపంలోని వ్యవసాయ భూములు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడితే భూములు కోతకు గురై పంటలు దెబ్బతింటాయని వాపోతున్నారు. సోమవారం పట్టపగలే తవ్వకాలు సాగించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సమీప రైతులు, గ్రామస్థులు ఏకమై తవ్వకాలను అడ్డుకున్నారు. వాహనాలను ముట్టడించి అక్కడికక్కడే ఆందోళనకు దిగారు.

రాజకీయ ఒత్తిళ్లకు పోలీసులు లొంగిపోయారా?

మట్టి దోపిడీపై రైతులు ‘డయల్ 100’కు ఫోన్ చేసి సమాచారం అందించడంతో చారకొండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అక్రమంగా మట్టిని తరలిస్తున్న జేసీబీ, టిప్పర్లను గ్రామస్థులు పట్టుకుని అప్పగించినప్పటికీ.. పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ కౌన్సిలర్ నుంచి వచ్చిన రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే, ఎలాంటి కేసు నమోదు చేయకుండానే పోలీసులు వారిని వదిలేశారనే ఆరోపణలు వస్తున్నాయి.

’అనుమతులు ఉంటేనే రండి’ అంటూ ఉచిత సలహాలు ఇస్తూ వాహనాలను అక్కడి నుంచి పంపించివేయడంపై రైతులు మండిపడుతున్నారు. రాజకీయ అండదండలతో ప్రకృతి సంపదను దోచుకుంటున్న అక్రమార్కులపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని జూపల్లి రైతులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా మైనింగ్, రెవెన్యూ అధికారులు స్పందించి చింత చెరువును కాపాడాలని కోరుతున్నారు.