23 May, 2026 | 2:56 AM

తరుగు పేరుతో నిలువు దోపిడీ..

23-05-2026 01:31 AM

వెంకటాపూర్, మే 22 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పదిహేను రోజులుగా వడ్లు కొనుగోలు చేయడం లేదని, అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మాజీ జడ్పీ చైర్పర్సన్, బీఆర్‌ఎస్ ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ బడే నాగజ్యోతి, మాజీ రెడ్కో చైర్మన్, బీఆర్‌ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు మహబూబాబాద్ నియోజకవర్గ ఇంచార్జి సతీష్ రెడ్డి ఆరోపించారు. మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం వారు సందర్శించారు.

ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకు న్నారు. లారీలు సమయానికి రాకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షాలకు తడిసి రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించి 25 రోజులు గడిచినా ఇప్పటి వరకు కేవలం రెండు లారీలు మాత్రమే రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడిసిపోయిందని, రైతులు మళ్లీ ఎండబెట్టి సిద్ధం చేసినప్పటికీ ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని విమర్శించారు.

ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం సమీక్షలు నిర్వహించడం లేదని, ఒక్క మంత్రి కూడా జిల్లాల్లో పర్యటించలేదని ప్రశ్నించారు. సీఎం రైతులను పూర్తిగా గాలికొదిలేశారని, రైతుల సమస్యలపై ప్రభుత్వానికి పట్టింపు లేదన్నారు. ప్రభుత్వం వెంటనే వడ్లు కొనుగోలు చేయాలని, లేకపోతే రైతుల పక్షాన బీఆర్‌ఎస్ నాయకులు కలెక్టరేట్లను ముట్టడిస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లింగాల రమణారెడ్డి, రమేష్ రెడ్డి, కుమార్, మల్క రమేష్, బిక్షపతి, జగదీష్, యాదగిరి, జ్ఞానేందర్, అశోక్, వీరమలు పాల్గొన్నారు.