15 June, 2026 | 11:23 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

అభివృద్ధిపై నీలినీడలు!

19-10-2025 12:08 AM
  1. నెలలుగా నిధుల వినియోగంపై అంతులేని జాప్యం
  2. మౌనం వీడని స్పెషల్ ఆఫీసర్, కమిషనర్
  3. ప్రజాధనంపై శ్వేతపత్రం విడుదల చేయాలంటున్న బీఆర్‌ఎస్

మణికొండ, అక్టోబర్ 18, విజయక్రాంతి: మణికొండ పురపాలక సంఘం అభివృద్ధికి కేటాయించిన రూ. 232 కోట్ల భారీ నిధుల వినియోగంపై తీవ్ర గందరగోళం నెలకొంది. నిధులు ఖజానాకు చేరి ఎనిమిది నెలలు గడుస్తున్నా, క్షేత్రస్థాయిలో ఒక్క అభివృద్ధి పని కూడా మొదలుకాకపోవడంపై స్థానికుల్లో, రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పర్యవేక్షణ లోపంతో ప్రజాధనం మూలుగుతోందని, దీనికి ఎవరు జవాబుదారీ అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

ఈ ఏడాది ఫిబ్రవరిలో స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ నుంచి స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం ఈ నిధులను మణికొండ పురపాలక సంఘానికి ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే, 2025 జనవరి 26న పాలకవర్గం కాలపరిమితి ము గియడంతో, తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారం కౌన్సిల్ అధికారాలతో స్పెషల్ ఆఫీసర్ను నియమించారు. అప్పటి నుంచి పురపాలక కమిషనర్, స్పెషల్ ఆఫీసర్ పాలనలోనే కార్యకలాపాలు సాగుతున్నాయి.

నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటి వినియోగంపై గానీ, కనీసం పురపాలక సంఘం ఆదాయ వ్యయాలపై గానీ అధికారులు ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై అనుమానాలు బలపడుతున్నా యి. మణికొండ పరిధిలో రోడ్లు, డ్రైనేజీ, నాలాలు, కమ్యూనిటీ హాళ్లు వంటి అనేక అభివృద్ధి పనులు అత్యవసరంగా చేపట్టాల్సి ఉంది. నిధులు లేవని గతంలో చెప్పిన అధికారులు, ఇప్పుడు ‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని‘ అన్న చందంగా నిధులున్నా పనులు చేపట్టకపోవడం విచారకరమ ని స్థానికులు వాపోతున్నారు.

ఈ నేపథ్యం లో, బీఆర్‌ఎస్ మణికొండ అధ్యక్షుడు సీతా రాం ధూళిపాళ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు తీవ్రంగా స్పందించారు. పురపాలక స్పెషలాఫీసర్, కమిషనర్ తక్షణమే స్పందించి రూ. 232 కోట్ల నిధుల వినియోగంపై ప్రజలకు సమగ్రమైన వివరణ ఇవ్వాలని, శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాధనం విషయంలో పారదర్శకంగా వ్యవహరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.