5 August, 2026 | 9:06 PM

తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేత

05-08-2026 07:58 PM

వెల్దుర్తి,(విజయక్రాంతి): మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ఏర్పాటు చేయాలని కోరుతూ మండల కేంద్రానికి చెందిన గ్రామస్తులు, యువకులు,  ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీ నాయకులు బుధవారం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి వినతి పత్రం అందజేశారు. శివంపేట మండలంలో అధికారిక కార్యక్రమంలో  హాజరైన ఎమ్మెల్యేను కలిసి మండలంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి రావాలంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను వెల్దుర్తి మండల కేంద్రం లోనే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

వినతి పత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి స్పందిస్తూ వెల్దుర్తి మండలానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు కావడం ఎంతో శుభదాయకమని, అలాగే ఇట్టి స్కూళ్ళు మండల కేంద్రంలోనే నిర్మించుట  కోసం తన వంతు  కృషి చేస్తానని అన్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తానని తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు.ప్రజా ప్రతినిధులు  గ్రామస్తులు యువకులు,హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల కేంద్రానికి చెందిన అన్ని రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.