జన్మదిన వేడుకలు ఆడంబరంగా కాదు.. సేవా కార్యక్రమాలతో నిర్వహించండి
ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్
ఆగస్టు 11 జన్మదినం సందర్భంగా బొకేలు, శాలువాలు, బహుమతులు తీసుకురావద్దని విజ్ఞప్తి.
పేదలు, విద్యార్థులు, రోగులకు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపు.
మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని సూచన
సత్తుపల్లి,(విజయక్రాంతి): సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ హృదయపూర్వక విజ్ఞప్తి చేశారు. ప్రియమైన సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు, ఈ నెల ఆగస్టు 11న తన జన్మదినం సందర్భంగా తనపై ప్రేమాభిమానాలు చూపించాలనుకునే ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఎవరూ కూడా బొకేలు, శాలువాలు, స్వీట్లు లేదా ఇతర బహుమతులు తీసుకురావద్దని మనస్ఫూర్తిగా కోరారు.
తనపై ఉన్న అభిమానాన్ని అలాంటి ఆడంబరాల ద్వారా కాకుండా సమాజ సేవ ద్వారా చాటాలని విజ్ఞప్తి చేశారు. మీ గ్రామాల్లో మీకు సాధ్యమైన మేరకు సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు పుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ చేయాలని, హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు, దుస్తులు, అవసరమైన వస్తువులు అందించాలని కోరారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, ఆహారం లేదా అవసరమైన సహాయం చేయాలని, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, పేద, నిరుపేద కుటుంబాలకు తమ వంతు సహాయం అందించాలని సూచించారు.
పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. తన జన్మదినం నిజమైన వేడుక సమాజానికి ఉపయోగపడే ఒక మంచి పని జరిగినప్పుడే పూర్తవుతుందని పేర్కొన్నారు. "మనమందరం కలిసి 'సేవే పరమో ధర్మం' అనే భావనతో ముందుకు సాగుదాం. మీ ప్రేమాభిమానాలకు ఎల్లప్పుడూ కృతజ్ఞురాలిని" అని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పేర్కొన్నారు.






