8 July, 2026 | 2:00 AM

కల్వర్టులోకి దూసుకెళ్లిన బొలెరో..

08-07-2026 12:00 AM

 త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

అలంపూర్, జూలై 7: గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపూర్ స్టేజి సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తాపడి కల్వర్టులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న వారు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న బొలెరో వాహనం జల్లాపూర్ స్టేజి సమీపానికి రాగానే ఒక్కసారిగా స్కిడ్ అయి అదుపుతప్పింది.

అనంతరం జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న కల్వర్టులోకి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో ప్రయాణికుడు అభి, సోమన్నకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.వాహనం కల్వర్టులో పడినప్పటికీ పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.