8 July, 2026 | 2:01 AM

రెండు కీలక శాసనసభ కమిటీల్లో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

08-07-2026 12:00 AM

మైనారిటీల సంక్షేమ కమిటీ, రూల్స్ కమిటీల్లో సభ్యత్వం..

రాష్ట్ర నాయకత్వం విశ్వాసానికి నిదర్శనమంటున్న రాజకీయ వర్గాలు

వనపర్తి, జూలై 7 (విజయక్రాంతి): తెలంగాణ శాసనసభ 202627 సంవత్సరానికి సంబంధించిన వివిధ శాసనసభ కమిటీలను ప్రకటించగా, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి ఒకేసారి రెండు కీలక కమిటీల్లో సభ్యత్వం లభించింది. శాసనసభ విడుదల చేసిన అధికారిక బులెటిన్ ప్రకారం ఆయనను మైనారిటీల సంక్షేమ కమిటీతో పాటు రూల్స్ కమిటీ సభ్యుడిగా నియమించారు. శాసనసభ వ్యవహారాల్లో అత్యంత ప్రా ధా న్యం కలిగిన ఈ రెండు కమిటీల్లో చోటు ద క్కడం నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

రెండు ప్రధాన కమిటీలో ఎమ్మెల్యేకు సభ్యత్వం..

శాసనసభ కమిటీలు ప్రభుత్వ పనితీరు, శాఖల కార్యకలాపాలు, సంక్షేమ పథకాల అమలు, శాసనసభ నిర్వహణ తదితర అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహిస్తూ ప్రభుత్వానికి సూచనలు చేసే కీలక వ్యవస్థగా గుర్తింపు పొందాయి.

ఈ నేపథ్యంలో ఒకే ఎమ్మెల్యేకు రెండు ప్రధాన కమిటీల్లో సభ్యత్వం దక్కడం అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. మైనారిటీల సంక్షేమ కమిటీకి లక్ష్మీకాంతారావు అధ్యక్షత వహించనుండగా, సభ్యుడిగా మేఘారెడ్డి రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమం, విద్య, ఉపాధి అవకాశాలు, ఆర్థికాభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలను పరిశీలించనున్నారు. కమిటీ నిర్వహించే సమావేశాలు, క్షేత్రస్థాయి పర్యటనలు, శాఖల సమీక్షల ద్వారా సమస్యలను గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించే బాధ్యతల్లో ఆయన భాగస్వామ్యం కానున్నారు.

అదేవిధంగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన పనిచేసే రూల్స్ కమిటీలోనూ సభ్యుడిగా మేఘారెడ్డి నియమితులయ్యారు. శాసనసభ నిర్వహణ నియమాలు, విధివిధానాల్లో అవసరమైన మార్పులు, సభా కార్యక్రమాల సమర్థ నిర్వహణ, సభ్యుల హక్కులు, బాధ్యతలకు సం బంధించిన అంశాలను పరిశీలించి సూచనలు చేసే బాధ్యత ఈ కమిటీపై ఉంటుంది. శాసనసభ పనితీరును సమర్థవంతంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

శాసనసభలో చురుకైన పాత్రను గుర్తించి ఎమ్మెల్యే కు అవకాశం..

ఇటీవల శాసనసభ సమావేశాల్లో వనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి, సాగునీరు, తాగునీరు, రహదారులు, విద్య, వైద్యం తదితర ప్రజా సమ స్యలను మేఘారెడ్డి ప్రస్తావిస్తూ వస్తున్నారు. ప్రజా సమస్యలపై ఆయన చూపుతున్న చొరవ, శాసనసభలో చురుకైన పాత్రను గుర్తించిన రాష్ట్ర నాయకత్వం ఈ రెండు కీలక కమిటీల్లో అవకాశం కల్పించినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎమ్మెల్యే మేఘారెడ్డికి రెండు కీలక కమిటీల్లో సభ్యత్వం లభించడంపై కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చే స్తున్నారు. ఈ అవకాశంతో వనపర్తి నియోజకవర్గ సమస్యలను రాష్ట్ర స్థాయిలో మరిం త బలంగా ప్రస్తావించే అవకాశం లభిస్తుందని శ్రేణులు అభిప్రాయ పడుతున్నారు.

రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తా.. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

 తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతలు అ ప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. శాసనసభ కమిటీల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చురుకుగా పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధికి తన వంతు సహకా రం అందిస్తానన్నారు. ముఖ్యంగా వనపర్తి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కమిటీల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని, నమ్మకాన్ని నిలబెట్టుకునేలా బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు.