రేపిస్టులను ఉరితీస్తాం
- వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు తీసుకొస్తాం
- గవర్నర్ ఆమోదించకపోతే రాజ్‌భవన్ ఎదుట బైఠాయిస్తాం
- సీబీఐ న్యాయం కాకుండా ఆలస్యమే చేస్తుంది
- బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
కోల్‌కతా, ఆగస్టు 28: రాష్ట్రంలో అత్యాచారాలకు పాల్పడేవారికి ఉరిశిక్ష పడాల్సిందేనని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బెంగాల్‌లో తాను ప్రశాంతతను కోరుకుంటున్నట్లు తెలిపారు. బుధవారం తృణమూల్ ఛాత్ర పరిషత్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఈ రోజును అత్యాచార బాధితురాలికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే వారం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో రేపిస్టులకు మరణశిక్ష పడేలా బిల్లు తెచ్చి ఆమోదిస్తామని తెలిపారు. ఈ బిల్లును గవర్నర్‌కు పంపిస్తామని, ఆయన ఆమోదించకపోతే రాజ్‌భవన్ ఎదుట బైఠాయించి నిరసన చేపడుతామని చెప్పారు. ఎలాగైనా ఈ బిల్లును గవర్నర్ ఆమోదించాల్సిందేనని, జవాబుదారీతనం నుంచి ఆయన తప్పించుకోలేరని మమత అన్నారు.
బెంగాల్ పరువు తీసేందుకే..
బుధవారం బీజేపీ చేపట్టిన బెంగాల్ బంద్‌పై స్పందించిన మమత.. బాధితురాలికి న్యాయం జరగకుండా రాష్ట్రాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఘటన జరిగిన నాటి నుంచి 16 రోజులు ఎదురుచూశానని, సీబీఐ న్యాయం చేయకుండా ఆలస్యం మాత్రమే చేస్తుందని ఎద్దేవా చేశారు. బీజేపీ బంద్‌కు తాము మద్దతు ఇవ్వబోమని, బీజేపీ ఎన్నడూ యూపీ, మధ్యప్రదేశ్, మణిపూర్ సీఎంల రాజీనామాలకు డిమాండ్ చేయలేదని కౌంటర్ ఇచ్చారు. నబన్నా అభియాన్ ర్యాలీని సమర్థంగా అడ్డుకున్న పోలీసుకు సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. ఏం జరిగినా జూడా అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు.
ఢిల్లీలో అంతకుమించి
బీజేపీ బంద్‌ను టీఎంసీ నేత, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఖండించారు. ఉన్నావ్, హథ్రస్, బద్లాపూర్ ఘటనలు జరిగినప్పుడు ఆ పార్టీ ఏమైందని ప్రశ్నించారు. ఢిల్లీలో ఇంతకంటే పెద్ద ఆందోళన నిర్వహిస్తామని, మహిళల భద్రత గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీ లేదని ధ్వజమెత్తారు. నిరసనలతో రోడ్లపైకి కాకుండా అత్యాచార వ్యతిరేక బిల్లులతో రావాలని సూచించారు. ఆ దమ్ము కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డాకు ఉందా? అని నిలదీశారు.




