ఆషాఢ మాసం బోనాలు షురూ.. జగదాంబికకు తొలి బోనం
07-07-2024 03:21 PM
హైదరాబాద్ : తెలంగాణలో ఆషాడ మాసం బోనాల పండుగ ఆదివారం వైభవంగా ప్రారంభమైంది. ప్రతి ఏటా ఆషాడ మాసంలో బోనాల ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఆషాడ బోనాల జాతర ఆగస్టు 4వ తేదీ వరకు కొనసాగుతుంది. గోల్కొండలోని శ్రీ జగదాంబిక అమ్మవారు తొలి బోనం అందుకున్నారు. లంగర్ హౌజ్ చౌరస్తాలోని అమ్మవారికి ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పట్టువస్త్రాలు సమర్పించారు.
లంగర్ హౌస్ నుంచి ఊరేగింపుగా వెళ్లి చోట బజార్ లోని పూజారి ఇంట్లో ఉన్న అమ్మవారి విగ్రహాలకు పట్టు వస్తాలను సమర్పించారు. బంజారా దర్వాజ వైపు నుంచి గోల్కొండ కోటకు నజర్ బోనం ఊరేగింపు జరుగుతుంది. జూలై 21,22 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు, జూలై 28,29 తేదీలో లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు నిర్వహించనున్నారు. బోనాల జాతరలో స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి ప్రభాకర్ పాల్గొన్నారు.






