బోనాల ఉత్సవాల్లో స్వేచ్ఛగా పాల్గొనాలి
- హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 15 (విజయక్రాంతి): ప్రజాస్వామిక తెలంగాణలో ఈ ఏడాది బోనాల ఉత్సవాల్లో ప్రజలంద రూ స్వేచ్ఛగా పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. గ్రేటర్‌లో ఆషాఢ మాస బోనాల జాతరను విజయవంతంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన చర్యలపై జూబ్లీహిల్స్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో వివిధ విభాగాల అధికారులతో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. బోనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించాలని తెలిపారు. శిక్షణ పొం దుతున్న పోలీసులను భద్రతలో వినియోగించుకోవాలని సూచించారు. నగరంలోని అన్ని దేవాలయాలకు రంగులతో పాటు విద్యుత్ అలంకరణ చేయాలని పేర్కొన్నారు. బక్రీదుకు సైతం అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
విపత్తుల సహాయక చర్యలపై వలంటీర్లకు శిక్షణ
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వానకాలం లో సంభవించే వరదలు, విపత్తుల సమయంలో చేపట్టాల్సిన సహాయక చర్యలపై జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం విభాగం అధికారులు పౌరులకు, ఎన్‌జీవోల ప్రతినిధులకు శనివారం ఒకరోజు శిక్షణ నిర్వహించారు. నాగోల్ ఫతుల్‌గూడలోని ట్రైనింగ్ సెంటర్‌తో పాటు ఇందిరా పార్కు చెరువులో ఈవీడీఎం సిబ్బంది మెళకువలపై అవగాహన కల్పించారు. శిక్షణలో 224 మంది పాల్గొన్నారు.






