4 March, 2026 | 2:37 AM

రైతు పేరిట బు(క్)క్కు.. అందినకాడికి నొక్కు!

04-03-2026 12:37 AM
  1. రైతుల పేర్లపై బుక్ చేసి యూరియా అమ్ముకుంటున్న దుకాణాదారులు

మామూళ్ల మత్తులో అధికారులు!

యూరియా కోసం అష్ట కష్టాలు పడుతున్న రైతులు                           

అధికారుల తీరుపై సర్వత్ర విమర్శలు

తుంగతుర్తి, మార్చి3 : పంట సాగు చేసిన రైతన్న మొక్కల ఎదుగుదలకు అవసరమైన యూరియా కోసం నెలల తరబడి ఎదురు చూస్తూనే ఉన్నాడు. రోజులు గడుస్తున్న రైతన్న అవసరం మాత్రం తీరడం లేదు. కానీ దుకాణ దారులు మాత్రం ఒక్క కట్టను రూ.350 నుండి 500 వరకు స్వేచ్ఛగా అమ్ముతూనే ఉన్నారు. రైతులకు దొరకని యూరియా దుకాణదారులకు మాత్రం ఎలా వస్తుందని ప్రశ్నలు వెలువెత్తుతున్నా యి. 

అయితే తుంగతుర్తి మండల కేంద్రం లో యూరియా సరఫరాపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జోరుగా దుకాణాల్లో అమ్మకాలు :  ఫెర్టిలైజర్ యాప్లో రైతుల పేర్లపై బుక్ చేసినా యూరియాను షాపులలోనే నిల్వ ఉంచి అధిక ధరలతో పాటు ఇతర మందులతో లింక్ చేసి అమ్ముతున్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తు న్నాయి. ఈ వ్యవహారాన్ని గమనించిన రైతులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా ఈ తంతు అంతా వెలుగులోకి వచ్చింది. 

అలా బుక్ చేసి.. ఇలా  అమ్ముతూ..

సాధారణ రైతు యూరియా కోసం అష్టకష్టాలు పడుతుండగా దుకాణదారులు తెలివిగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. కొందరు పెస్టిసైడ్స్ దుకాణాల్లో రైతుల పేర్లపై ఉన్నటువంటి పాసుబుక్కుల జిరాక్స్ పేపర్లను ముందుగా తీసుకొని వారి పేరుపై యూరియా బుకింగ్ చేసి, ఆన్లైన్ సైట్ లో జీరో చూపిస్తున్నారు.

అలా బుక్ చేసిన బస్తాలు మిగిలించుకొని అవి రైతులకు ఇవ్వకుండా పలు రకాల పురుగుమందులతో కలిపి విక్రయించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గమనించిన తుంగతుర్తి వ్యవసాయ సంచాలకులు గత నెలలో అన్నారంలోని ఓ పెస్టిసైడ్ షాప్ యజమానికి సంబంధించిన లైసెన్సును నెల రోజుల పాటు రద్దు చేశారు.                              

అధికారుల తీరుపై అనుమానాలెన్నో ..

తుంగతుర్తి మండల కేంద్రంలోని రెండు షాపులు యూరియా విషయంలో అవకతవకలకు  పాల్పడగా అధికారులు నామమా త్రంగా వెళ్లి వారి రికార్డులను స్వాధీనం చేసుకొని సూర్యాపేట డిఏఓ ఆఫీస్ కి అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే సదరు అధికారి కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేధని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.  తుంగతుర్తి వ్యవసాయశాఖాదికారులు డబ్బులకు దాసోహమవుతూ దుకాణాదారులపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని పంట మొక్కలు ఎదగని రైతులు విమర్శిస్తున్నారు.

జరిగిన సంఘటనపై పూర్తిస్థాయిలో జిల్లా అధికారులు, కలెక్టర్ విచారణ జరిపి మండల కేంద్రంలోని ఫెర్టిలైజర్ షాప్ యజమానులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీల నాయకులు, రైతులు కోరుతున్నారు. మండలంలో ఇలాంటి ఘటనలు ఇదివరకు కూడా జరిగినట్టు రైతులు చెబుతున్నారు. అప్పట్లో సంబంధిత షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ, మళ్లీ అదే పరిస్థితి పునరావృతం కావడం బాధాకరమని రైతులు పేర్కొంటున్నారు. 

అక్రమంగా యూరియా నిల్వ చేస్తే చర్యలు తప్పవు 

యూరియాను ఎవరైనా అక్రమంగా నిలువ చేస్తే వారిపై చర్యలు తప్పవు. రైతులు వారి పేరు మీదనే స్వయంగా ఆన్లైన్ చేసుకొని యూరియా తీసుకోవాలి. రైతులకు యూరియా అందించేం దుకు నా వంతు కృషి చేస్తున్నా. నాపై వచ్చే అభియోగాలను రైతులు నమ్మవద్దు. యూరియా బస్తాల్లో తారతమ్యా లు చూపించిన షాపులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.

- రమేష్‌బాబు, వ్యవసాయ సంచాలకులు, తుంగతుర్తి