4 March, 2026 | 2:53 AM

మేడ్చల్‌లో కంపు.. కంపు!

04-03-2026 12:50 AM

పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు అధ్వాన్నంగా మారిన రోడ్లు 

కార్పొరేషన్‌లో విలీనంతో పెరిగిన కష్టాలు 

సమస్యల పరిష్కారానికి చొరవ చూపని ప్రభుత్వం 

మేడ్చల్ అర్బన్, మార్చి 3 (విజయక్రాంతి): మేడ్చల్ పట్టణ ప్రజలు వివిధ సమస్యలతో నరకం అనుభవిస్తున్నారు. నడి వీధులలో డ్రైనేజీలు పొంగిపొర్లడం, గుంతల మయమైన రోడ్లు, తాగునీటి కొరత, దోమల బెడద వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. పట్టణంలో అన్ని వీధులలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పొంగిపొర్లుతోంది. దీంతో డ్రైనేజీ నీరంతా రోడ్లమీద వరదల ప్రవహిస్తోంది. రోడ్లమీద డ్రైనేజీ నీరు ప్రవహించడంతో కంపు వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులు లేవు. చాలా ఏళ్ల క్రితం అండర్ గ్రౌండ్ పైపులు వేశారు. ప్రస్తుతం పట్టణ జనాభా, ఇళ్ల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. అపార్ట్మెంట్ లతోపాటు, గృహాలను రెండు మూడు అంతస్తుల నిర్మించి అద్దెకు ఇచ్చారు. దీంతో ఇళ్ల నుంచి వచ్చే నీటికి పైపులు సరిపోవడం లేదు. దీంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పొంగుతుంది. పట్టణంలోని కేఎల్‌ఆర్ కాలనీలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఈ కాలనీలో తరచూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పొంగుతోంది. 

రోడ్లు అధ్వానం 

పట్టణంలో రోడ్లు సైతం అధ్వానంగా తయారయ్యాయి. అడుగడుగునా గుంతలు, కాలువలు, స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. ద్విచక్ర వాహనాలపై ఇంటి నుంచి బయటకు నాలుగుసార్లు వెళితే నడుము నొప్పితో మంచం పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. పట్టణ రోడ్లు మరమ్మతు చేయక చాలా ఏళ్లయింది. కేఎల్‌ఆర్ వెళ్లే రోడ్డు మరీ ఘోరంగా ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కనీసం తట్టెడు మట్టి పోసే పరిస్థితుల్లో కూడా లేరు. గ్రామాలలో రోడ్లు అద్దంలా ఉండగా, కార్పొరేషన్ రోడ్లు అద్వానంగా ఉన్నాయి. 

హోదాతో పాటు కష్టాలూ పెరిగాయి 

మేడ్చల్ మున్సిపాలిటీ ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనమైంది. హోదా పెరగడంతో పాటు ప్రజల కష్టాలు కూడా పెరిగాయి. మున్సిపాలిటీగా ఉన్న సమయంలో చిన్న చిన్న పనులు చేసేవారు. సైబరాబాద్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత చిన్న అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేకపోతున్నారు. నిధులు లేనందున ఏమి చేయలేకపోతున్నామని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అంటున్నారు. పట్టణంలో దోమల బెడద తీవ్రంగా ఉంది.

దోమలతో ప్రజలు జాగారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దోమల వల్ల వ్యాధులు కూడా వస్తున్నాయి. కార్పొరేషన్ అధికారులు దోమల నివారణకు ఫ్యాగింగ్ చేయడం లేదు. మున్సిపాలిటీగా ఉన్న సమయంలో అప్పుడప్పుడు ఫ్యాగింగ్ చేసేవారు. పట్టణంలో తీవ్ర నీటి ఏర్పడింది. మిషన్ భగీరథ నీరు సరిపడేంతరానందున పట్టణంలో కీళ్ల సరఫరా చేయలేకపోతున్నారు. ప్రజలు ట్యాంకర్ వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిధులు మంజూరు చేసి సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటాం 

రోడ్లమీద మురుగునీరు ప్రవహించకుండా చర్యలు తీసుకుంటామని డి ఈ విజయలక్ష్మి తెలిపారు.