4 March, 2026 | 2:37 AM

రైతులను బెంబేలెత్తిస్తున్న మోటర్ కేబుల్ వైర్ల దొంగలు

04-03-2026 12:35 AM
  1. వ్యవసాయ మోటార్ల కేబుల్ వైర్ల లక్ష్యంగా దొంగతనాలు

దాదాపు 20 మోటార్ల వైర్లను కత్తిరించిన దుండగులు

మోటార్లకు వైర్లు లేక లబోదిబోమన్న రైతులు

సుభాష్ నగర్ లక్ష్యంగా  దొంగతనాలు 

గరిడేపల్లి, మార్చి 3 : సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని అబ్బిరెడ్డి గూడెం గ్రామ పంచాయతీ పరిధి సుభాష్ నగర్ లో 20 వ్యవసాయ మోటార్ల వద్ద కేబుల్ వైర్లను పలువురు దొంగలు కత్తిరించుకుపోయారు. మంగళ వారం ఉదయం పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులు ఈ విషయాన్ని గమనించారు. సబ్ మెర్సిబుల్ మోటారు నుంచి మెయిన్ బోర్డు వరకు ఉండే కేబుల్ వైర్లు కట్చేసి ఉండటాన్ని గమనించి స్థానిక రైతులు ఆందోళన చెందారు.

మొత్తం 20 మోటార్ల వరకు లెక్క తేలాయని బాధిత రైతులు గాదె మల్లారెడ్డి,జానపాటి శంకర్,నంద్యాల రాము, కుసుమ సైదిరెడ్డి,కాంతారెడ్డి తదితరులు చెప్పారు. ఒక్కో మోటారు వద్ద  40 మీటర్ల కేబుల్ వైరు కట్ చేశారని,మీటరు కేబుల్ వైరు రూ.150 చొప్పున ఉందని,ఈ లెక్కన 20 మోటార్ల వద్ద సుమారు రూ. 1లక్ష కేబుల్ వైర్లు కత్తిరించేశారని సదరు రైతులు చెప్పారు.గతంలో మూడుసార్లు కేబుల్ వైర్లు కట్ చేశారని,ఇది నాల్గోసారి అని పేర్కొన్నారు.

మూడుసార్లు ఇలాంటి సంఘటనలు జరగగా ఒకసారి పోలీసులకు ఫిర్యాదు చేశామని,ఒక్క దొంగని కూడా పట్టుకోలేదని,ఇకపై పోలీసులకు ఫిర్యాదు చేయదలచుకోలేదన్నారు. కరకట్టపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లయితే దొంగలు దొరుకుతారని,ఆ దిశగా పోలీసులు చర్యలు తీసుకోవటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.పంటలకు నీరు పెట్టాలంటే మళ్లీ ప్రతి మోటారుకు రూ.3,600 ఖర్చుచేసి కేబుల్ వైరు కొనాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇకనైనా పోలీసులు రాత్రి సమయాలో గట్టి నిఘా పెట్టి దొంగలను పట్టుకుని కేబుల్ వైర్ల చోరీలను అరికట్టాలని రైతులు కోరుతున్నారు.