04-12-2025 01:41:07 AM
అయ్యప్పల సమయస్ఫూర్తితో తప్పిన ప్రాణాపాయం
మహబూబాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): ఇంట్లో అయ్యప్ప మాలదారులకు భిక్ష నిర్వహించి పూజ చేస్తుండగా, టెంటు పైన కదలికలను గమనించిన అయ్యప్పలు ఇంటిపైకి వెళ్లి చూడగా టెంట్ పైన రెండేళ్ల బాలుడు కనిపించడంతో హతాషూలయ్యారు. వెంటనే సమయస్ఫూర్తితో ఆ బాలున్ని కిందకు దించి ప్రాణాలు రక్షించారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో బుధవారం జరిగింది. పట్టణానికి చెందిన కళ్యాణి గణేష్ దంపతులు తమ ఇంట్లో అయ్యప్ప మాలదారులకు భిక్ష ఏర్పాటు చేసి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో తమ రెండేళ్ల కుమారుడు రిత్విక్ మెట్ల పైనుంచి ధాబా ఎక్కి అక్కడి నుంచి ముందున్న టెంట్ పైకి దొర్లిపడ్డాడు. అయితే అక్కడ ఆ బాలుడు అటు ఇటు కదులుతుండడంతో అయ్యప్ప మాలదారులు గుర్తించి వెంటనే డాబా పైకి చేరుకోగా ఇంటుపైన బాలుడు కనిపించాడు. వెంటనే టెంట్ కింది భాగం నుండి కుర్చీలు పెట్టి బాలుడు కదలకుండా పట్టుకొని బాలున్ని చాకచక్యంగా ఒడిసిపట్టి కిందికి దించారు. దీనితో తమ కుమారుడికి ఎలాంటి ప్రాణాపాయం లేకుండా అయ్యప్ప రక్షించాడంటూ తల్లిదండ్రులు పేర్కొన్నారు.