10 March, 2026 | 4:37 AM

స్పోర్ట్స్ వర్సిటీలో అంతర్జాతీయ సౌకర్యాలు

10-03-2026 03:05 AM
  1. యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీలో అన్ని రకాల క్రీడలకు మైదానాలు
  2. ఒలంపిక్స్, కామన్‌వెల్త్ క్రీడలకు రాష్ట్రం అతిథ్యమిచ్చేలా ప్రణాళికలు 
  3. ఇప్పుడున్న స్టేడియాలను ఆధునీకరించాలి
  4. క్రీడాశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండి యా స్పోర్ట్స్ యూనివర్సిటీలో సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. అన్ని రకాల క్రీడల కు మైదానాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో క్రీడాశాఖపై మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ రామకృష్ణారావుతో కలిసి సీఎం సమీక్ష నిర్వ హించారు.

నిర్మాణాల డిజైన్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా రాష్ట్రంలో అన్ని సౌకర్యాలతోపాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణాలు ఉండాలని సూచించారు. గచ్చిబౌలి ఔట్‌డోర్ స్టేడియంను పునురుద్ధరించ డంతోపాటు స్టేడియం ఆవరణలో ఇండోర్ స్టేడియం, వర్సిటీకి కాంప్లెక్స్, హాస్టల్ భవనాలు, అన్ని రకాల క్రీడా మైదానాలు, శిక్షణకు అవసరమైన ఇతర సౌకర్యాలు ఉం డేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

ఒలింపిక్స్, కామన్‌వెల్త్ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా, ఒలింపిక్స్‌లో తెలంగాణ క్రీడాకారుల సత్తా చాటడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూ చించారు. నగరంలో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం, ఎల్బీస్టేడియం, సరూర్‌నగర్ స్టేడియంలను భవిష్యత్ అవసరాలు, శిక్షణ, పోటీలకు అనుగుణంగా ఆధునీకరిచాలని ఆ దేశించారు. సమావేశంలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు శ్రీనివాసరాజు, శేషాద్రి, శాట్ ఎండీ సోని బాలదేవి, యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ వీసీ డా. కిశోర్ పాల్గొన్నారు.