calender_icon.png 4 December, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమైక్యవాది విగ్రహం

04-12-2025 01:39:57 AM

తెలంగాణ కళాకారులను పక్కనపెట్టి రవీంద్ర భారతిలో

బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేస్తారా?

జయ జయ హే తెలంగాణ గీతంలో ‘స్వరాష్ట్రమై తెలంగాణ

స్వర్ణయుగం కావాలి’ అనే చరణాన్ని తీసేయమనలేదా? 

* ప్రముఖ గాయకుడు, పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఈ నెల 15న రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆవిష్కరించనున్న సందర్భంలో హైదరాబాద్‌లో ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం అవసరమా? అని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ సాహిత్య, కళా రంగానికి ఎనలేని సేవలు చేసిన వారు, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన.. పైడి జయరాజ్, ప్రభాకర్‌రెడ్డి, గద్దర్, అందెశ్రీ, గూడ అంజన్న, ముచ్చెర్ల సత్యనారాయణ, చిందు ఎల్లమ్మ, మిద్దె రాములు, సుక్క సత్తయ్య వంటి మహామహుల విగ్రహాలేవీ  అని ప్రశ్నిస్తున్నారు.

బాలుతో పేచీ లేదు.. విగ్రహంతోనే పేచీ

హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి) : హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి లో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుండ టంపై తీవ్రస్థాయిలో వివాదం నడుస్తుంది. తెలుగు సినీ-సాంస్కృతిక రంగానికి ఆయన అందించిన సేవలు అపారమైనప్పటికీ, తెలంగాణ కళారంగానికి ప్రతీక, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న, రాష్ర్ట ప్రభుత్వ అధి కారిక కళా వేదిక అయిన రవీంద్రభారతిలో ఆయన విగ్రహం అవసరమా అనే ప్రశ్న చర్చనీయాంశమైంది.

బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్రభారతిలో ఏర్పాటు చేయ డం పట్ల తెలంగాణ వాదుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ సాహి త్య రంగానికి ఎనలేని సేవలు చేసినవారు, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన వారు అనేక మంది ఉన్నప్పటికీ వారి విగ్రహాలు ఏర్పాటు చేయకుండా బాలసుబ్రహ్మ ణ్యం విగ్రహం పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణకు చెందిన కళా ప్రముఖులు పైడి జయరాజ్, ప్రభాకర్‌రెడ్డి, గద్దర్, అందెశ్రీ, గూడ అంజన్న, ముచ్చె ర్ల సత్యనారాయణ, చిందు ఎల్లమ్మ, మిద్దె రాములు, సుక్క సత్తయ్య, వరంగల్ శంకర్, ధీకొండ సారంగపాణి వంటి వారి విగ్రహాలు పెట్టడంపై దృష్టిపెట్టని రాష్ట్ర ప్రభుత్వం బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడానికి ఎందుకు అనుమతి ఇచ్చిందని ప్రశ్నిస్తున్నారు.

అందులోనూ 2004 ప్రాంతంలో తెలంగాణ గీతమైన ‘జయ జయ హే తెలంగాణ’ పాటలో మార్పులు చేస్తేనే పాడతానని చెప్పి, పాటను తిరస్కరించిన బాలసుబ్రమణ్యం లాంటి వ్యక్తి విగ్రహం రవీంద్రభా రతిలో ఏర్పాటుచేయడానికి అంగీకరించబోమని తేల్చిచెబుతున్నారు. అయితే బాలసు బ్రహ్మణ్యం  అంటే అందరికీ అభిమానమేనని. కానీ ఆయన విగ్రహం రవీంద్రభారతి లో కాకుండా వేరే చోట పెట్టాలని సూచిస్తున్నారు. అయితే ఈ నెల 15వ తేదీన బాలసు బ్రహ్మణ్యం విగ్రహాన్ని ప్రభుత్వం అధికారికంగా ఆవిష్కరిస్తున్నది.

ఈ క్రమంలో సినీ నటుడు శుభలేఖ సుధాకర్ బుధవారం రవీంద్రభారతిలో విగ్రహావిష్కరణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆ సమయంలో ఒక ఛానల్ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని చిత్రీకరించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ తోసివేశారని నిరసన వ్యక్తమైంది. ఈ క్రమంలో తెలంగాణవాదులకు, శుభలేఖ సుధాకర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది. 

వీళ్ల విగ్రహాలేవి..

తెలంగాణకు చెందిన కళా ప్రముఖులు పైడి జయరాజ్, ప్రభాకర్‌రెడ్డి, గద్దర్, అందెశ్రీ, గూడ అంజన్న, ముచ్చెర్ల సత్యనారాయణ, చిందు ఎల్లమ్మ, మిద్దె రాములు, సుక్క సత్తయ్య, వరంగల్ శంకర్, ధీకొండ సారంగపాణి, బొమ్మాళ శంకరయ్య, సైద్ధం రాజేశ్వర్, కవి కుశాల్, రంగారెడ్డి రంగ మైదానం కళాకారులు, మోపురి రామన్న, శతవధాని గారపాటి ఇలాంటి ఎంతోమంది తెలంగాణ కళాకారులు రవీంద్ర భారతిలో గుర్తింపునకు అర్హులు. కానీ వారి విగ్రహాలు ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతున్నది.

ఈ క్రమంలో తెలంగాణ కళా ప్రతీక అయిన రవీంద్ర భారతిలో తెలంగాణ కళాకారులను పక్కనపెట్టి, ఏపీ మూలాలు ఉన్న బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు అవసరమా? అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది రాజకీయంగా అనేక విమర్శ లకు తావిస్తున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ భావజాలం అర్థం కాలేదని.. ఇది ఏపీ లాబీల ప్రభావం అన్న భావన బలపడుతోంది. రవీంద్రభారతిలో శాశ్వత విగ్రహం ఏర్పాటు చేయాలంటే అది రాష్ర్ట సాంప్రదాయ వారసత్వాన్ని ప్రతిబింబించాలని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు. 

శంకర్ విగ్రహం పెట్టాలి

రవీంద్రభారతిలో పెట్టాల్సింది బాలీవుడ్ సంగీతజ్ఞుడు, హైదరాబాద్ దళిత బిడ్డ శంకర్ విగ్రహం. తెలంగాణ పాట పాడ                    నిరాకరించిన కులగజ్జి బాలుది కాదు.. మిలియ న్ మార్చ్ గుర్తుంది కదా!

 సంగిశెట్టి శ్రీనివాస్

ఆయన విగ్రహం ఎందుకు?

తెలంగాణ ప్రజలు 60 ఏళ్ల పాటు మాకు అస్తిత్వం లేదు, మాకు ఆత్మ గౌరవం లేదు, మా విగ్రహాలు లేవు, మాకు అన్యాయం జరి గిందని మొత్తుకుంటుం టే ఇక్కడ బాలు విగ్ర హం పెట్టడం సరైంది కాదు. 

 డా. పసునూరి రవీందర్

మరో ఉద్యమమే

బాల సుబ్రహ్మ ణ్యం కళ వెలకట్టలేనిదే. ఇప్పటివరకు హైదరాబాద్‌లో ఆంధ్ర ప్రాంత వ్యక్తుల విగ్రహాలే ఎక్కువగా ఉన్నాయి. బాలు విగ్రహాన్ని పెట్టడాన్ని వ్యతిరేకిస్తలేం. కానీ రవీంద్రభారతిలో కాకుండా వేరే చోట పెట్టాలి. ఉద్యమకాలం నుంచి మిలియన్ మార్చ్ సందర్భంలో మా ఉక్రోశాన్ని, కోపాన్ని ట్యాంక్‌బండ్‌పై ఉన్న విగ్రహాలను ట్యాంక్‌బండ్‌లో పడేయడం ద్వారా చూపించాం. మళ్లీ ఆ పరిస్థితి తీసుకురావొద్దు. బాలు విగ్రహం రవీంద్రభారతిలో పెడితే మరో ఉద్యమాన్ని ప్రారంభిస్తాం.  

 కావేటి గోపి, బీఆర్‌ఎస్ యువ నాయకులు

బాలు విగ్రహం పెడితే ఊరుకునేది లేదు

మన రాష్ట్రానికి సంబంధించిన వారెందరో ఉండగా, వారిని వదిలిపెట్టి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఎందు కు పెడుతున్నారు. 2004లో తెలంగాణ గీతం పాడాలని అడిగినప్పుడు ఆయన తిరస్కరించారు. ఆ గీతంలోని ‘స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి’ అనే చరణాన్ని తీసేస్తే పాడతానని చెప్పారు. తీసేయనని అందెశ్రీ చెప్తే, అప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆ పాటే పాడలేదు.

తెలంగాణను వ్యతిరేకించిన శక్తులను మా ప్రాంతంలో, మమ్మిల్ని అవమాన పర్చేందుకు, ఆత్మగౌరవం కోసం కొట్లాడి 12 వందల మంది అమర వీరుల బలిదానం చేస్తే వారి సాక్షిగా రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడతామంటే చూసుకుంటూ ఊరుకునేది లేదు. ఈ ప్రాంతంలోని కవులు, కళాకారుల విగ్రహాలు ఆంధ్ర ప్రాంతంలో పెట్టారా?. సమైక్య రాష్ట్రంలో సీఎం అయిన చెన్నారెడ్డి, ప్రధాన మంత్రిగా చేసిన పీవీ నరసింహారావు విగ్రహాలు ఏపీలో ఎన్ని ఉన్నాయి?.

అమీర్‌పేట్ మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహం పెడతానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహం ఎందుకు పెట్టాలే?. ఎన్టీఆర్‌కు స్మతివనం ఉంది. మైత్రివనంలో ప్రముఖ నటుడు ప్రభాకర్‌రెడ్డిది పెట్టండి. ప్రభాకర్‌రెడ్డి విగ్రహం పెడతానని ఈ ముఖ్యమంత్రికి నోరు రాదు. సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణలో చంద్రబాబు విగ్రహం కూడా పెట్టేలాగా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ పరిస్థితి పెనం నుంచి పోయిలో పడ్డట్టు అయింది.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటే మాకు కూడా గౌరవమే. కానీ తెలంగాణ ప్రాంతం వారికి అగౌరవం జరుగుతున్నది. ఎన్టీఆర్ విగ్రహం పెట్టడాన్ని వ్యతిరేకించే వారు ఉంటారా.. అలాంటి వారిని మూసీలో వేసి తొక్కుతామని రేవంత్‌రెడ్డి అన్నారు. మెస్సీ తీసుకొచ్చి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడటం కాదు.. తెలంగాణ ప్రజలు నిన్ను ఓట్లతో ఫుట్ బాల్ ఆడుతరు. గుర్తు పెట్టుకో. తెలంగాణ ఆత్మ వంచన ఇది. రేవంత్‌రెడ్డి వచ్చిన దగ్గర నుంచి ఈ రకమైన అవమానాలు జరుగుతూనే ఉన్నాయి.

మొన్న పాడె మోసిన అందెశ్రీ విగ్రహం ఎక్కడ?. తెలంగాణలో వీళ్లకు మించిన వారు లేరు.. తెలంగాణకు కూడా వీరే తలమానికం అని చెప్పడానికి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్రభారతిలో పెడుతున్నారా?. తెలంగాణకు సంబంధించిన కళాకారులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే కదా, ట్యాంక్ బండ్‌పైన ఉన్న విగ్రహాలను ట్యాండ్‌బండ్‌లో వేసింది. ఇది అస్తిత్వ పోరాటం. తెలంగాణ వచ్చాక కూడా ఇంత అన్యాయం చేస్తారా?.

అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 1200 మంది అమరవీరుల కుటుంబాలను గుర్తించి, వారి కుటుంబాల్లోని పిల్లలను చదివించి, ఆదుకుంటామని చెప్పి మేనిఫెస్టోలో కూడా పెట్టారు. మరి వారు ఎక్కడ ఉన్నారో తెలుసా సీఎం రేవంత్‌రెడ్డికి?. ఒక్క కుటుంబాన్ని అయినా ఆదుకున్నారా?. రవీంద్రభారతిలో తెలంగాణ వ్యతిరేకి విగ్రహం పెట్టడం మాకు సుతారం ఇష్టం లేదు.

1200 అమరుల సాక్షిగా తెలంగాణ స్వేచ్ఛ కోరుకున్నరు. ఇలా బానిసత్వం కోరుకోలేదు. తెలంగాణ కళాకారుల విగ్రహాలు కూడా ఏపీలో పెడతామని చంద్రబాబుతో ప్రకటన చేయించాలి. అమర జ్యోతికి ఇప్పటివరకు ఆవిష్కరణకు దిక్కులేదు. దాని ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతారు. కానీ అమరుల స్థూపాన్ని పట్టించుకోరు. 

 పృధ్వీరాజ్, 

తెలంగాణ ఉద్యమకారుడు

ఏపీ సచివాలయం ముందు పెడితేనే గౌరవం

బాలసుబ్రహ్మణ్యం అంటే అందరికీ గౌరవమే. ఆయన గొప్ప గాయకుడు, వేలాది పాటలు పాడారు. కళాకారులుగా మా అందరికీ ఆయన అభిమానమే. అంతవరకు ఏ పేచీ లేదు. బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆంధ్ర ప్రాంతంలో ఎందుకు పెట్టడం లేదు. హైదరాబాద్‌లో ఎందుకు పెడుతున్నారు. ఏపీలో కొత్త సచివాలయం, కొత్త రాజధాని నిర్మించుకున్న చోట ఎందుకు పెట్టడం లేదు.

తెలంగాణ ప్రజలు 60 ఏళ్ల పాటు మా అస్తిత్వం లేదు, మాకు ఆత్మ గౌరవం లేదు, మా విగ్రహాలు లేవు, మాకు అన్యాయం జరిగిందని మొత్తుకుంటుంటే ఇక్కడ బాలు విగ్రహం పెట్టడం సరైంది కాదు. బాలసుబ్రహ్మణ్యం ఏపీలోనే పెట్టాలి. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఏపీలో తెలంగాణ కళాకారుల విగ్రహాలు కంటికి కనిపించవు. వైఎస్‌ఆర్, కాసు బ్రహ్మనందారెడ్డి, ఎన్టీఆర్ వంటి వారివి అనేక విగ్రహాలున్నాయి.

మళ్లీ బాలసుబ్రహ్మ ణ్యం విగ్రహం పెట్టడం అంటే తెలం గాణ ఆత్మగౌరవాన్ని కించపర్చడమే అవుతుంది. ఏపీ సచివాలయం ముందు పెడితే ఆయనను గౌరవించినట్టు ఉంటుం ది. తెలంగాణలో ఎంతో గొప్ర కళాకారులు ఉన్నారు. గూడ అంజన్న, గద్దర్, అందె శ్రీ వంటి వారి విగ్రహాలు పెట్టడానికి ఇంకా ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు.

కానీ ఆంధ్ర కళాకారుల విగ్రహాలు పెడతామంటే ఎలా కరెక్ట్ అవుతుంది. తెలంగాణ వాదులు, ప్రజలు ఏ ఆంధ్ర వారి విగ్రహాలను భరించే, అంగీకరించే పరిస్థితులో లేరు. కానీ హైదరా బాద్‌లోనే పెట్టాలని ప్రభుత్వం అనుకుంటే ఫిల్మ్‌నగర్‌లో ఫిల్మ్ ఛాంబర్ ముందు పెట్టుకోవాలి. కానీ రవీంద్రభారతిలో పెడతామంటే స్వీకరించేందుకు సిద్ధంగా లేము. 

 డా.పసునూరి రవీందర్, 

తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సలహామండలి సభ్యులు