పిచ్చికుక్క స్వైర విహారం
చేగుంట,(విజయక్రాంతి): నార్సింగి మండల కేంద్రంలో పిచ్చి కుక్క తన స్వైర విహారం కొనసాగిస్తూ మంగళవారం మరో చిన్నారిని తీవ్రంగా గాయ పరచడంతో పాటు ముగ్గురిని కరిచింది. సోమవారం ఇదే కుక్క ఒకటవ వార్డు లో ఐదుగురిని కరవగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాధమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం మెదక్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం 5 వ వార్డు లో ఇంటి వద్ద ఆడుకుంటున్న రెండేళ్ల షానవాజ్ ను కుడి చేతి పై కరువగా రక్త గాయం తో పాటు ఎముక సైతం రెండుగా విరిగింది. చిన్నారిని తల్లిదండ్రులు వెంటనే ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకుని వెళ్లగా ప్రథమ చికిత్స అనంతరం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి కి అటు నుంచి పిల్లికొట్యాల్ లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పిచ్చి కుక్క రెండు రోజులలో 9 మందిని కరిచినా ఇంత వరకు దానిని పట్టుకోవలేకపోవడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వెంటనే ఆ కుక్కలు నిర్మూలించాలని, లేదా ఇంకా ఎంత మంది దాని బారిన పడాల్సి వస్తుందో అని ఆందోళన పడుతున్నారు. కుక్క కాటు కు గురైన క్షతగాత్రులను నార్సింగి ఉపసర్పంచ్ యెన్నం రాజేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఆకుల మల్లేశ్ గౌడ్, వార్డు సభ్యులు ఆటో జానీ, బాచి స్వామి, కటికె రాజేందర్ తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా మందుల కోసం ఉపసర్పంచ్ రాజేందర్ రెడ్డి కుక్క కారుకు గురైన యువతికి ఆర్థిక సహాయం అందించారు.
ఈఓ నాగభూషణం వివరణ
పిచ్చి కుక్క స్వైర విహారం, వరుసగా ప్రజలను కాటు వేయడం పై నార్సింగి ఈఓ నాగభూషణం కు వివరణ కోరగా పిచ్చి కుక్క ను పట్టుకునే ప్రయత్న చేస్తున్నాం అని, ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పించుకుంటోందని, వెంటనే ఖచ్చితంగా కుక్కలు పట్టుకుంటామని అన్నారు.






