ఆత్మహత్యకు కారణమైన ప్రియుడు అరెస్ట్
మేడ్చల్, మే 31 : యువతి ఆత్మహత్యకు కారణమైన ప్రియుడిని జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం జీడిమెట్ల పీఎస్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో బాలానగర్ ఏసీపీ హన్మంతరావు, సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ ని యోజకవర్గం న్యూఎల్బీనగర్‌కు చెందిన కుమార్ కుమార్తె అఖిల(22)ను అదే కాలనీకి చెందిన అఖి ల్‌సాయి గౌడ్ గత ఆరేళ్ల క్రితం ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు.
నిరాకరించగా చనిపోతానని బెదిరించడంతో ఒప్పుకుంది. ఆరు సంవత్సరాల పాటు మంచిగానే ఉన్న అఖిల్‌సాయిగౌడ్ ఇటీవల పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. నిలదీయడంతో రోడ్డుపైకి పిలిచి కొట్టడం, ఫోన్‌లో మెసేజెస్ చేసి వేధించడం ప్రారంభించాడు. తీవ్ర మనస్థాపానికి గురైన అఖిల మే 28వ తేదీన రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని అఖిల్‌సాయిగౌడ్‌ను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
దారి దోపిడీ చేసిన ఆరుగురు అరెస్ట్...
దారి దోపిడీ చేసి క్యాబ్ డ్రైవర్‌పై హత్యాయత్నం చేసిన ఆరుగురు నిందితులను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఏసీపీ హన్మంతరావు, సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. గుండ్లపోచంపల్లికి చెందిన కొండ స్వామి, షాపూర్‌నగర్‌లోని నెహ్రూనగర్‌కు చెందిన అమూల్యలు నానక్ రామ్‌గూడలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. అయితే, రోజూ మాదిరిగానే మే 30న ఉదయం 2 గంటలకు క్యాబ్‌లో ఇంటికి తిరిగి వస్తున్నారు. నెహ్రూనగర్ వద్దకు రాగానే స్థానికంగా ఉండే ఎండీ మజీద్ అలియాస్ మున్నా(24), అన్నారం అఖిల్(24)లు మధ్యం తాగుతూ రోడ్డుపైకి వచ్చారు.
డ్రైవర్ అనిల్‌ను బెదిరించి మెడపై బ్లేడ్‌తో కోయగా తీవ్ర రక్తస్రావమైంది. అనంతరం సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల సెల్‌ఫోన్‌లను తీసుకుని పరారయ్యారు. డ్రైవర్ అనిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణ చేపట్టిన పోలీసులు మజీద్, అఖిల్‌తో పాటు నెహ్రూనగర్‌కు చెందిన రాజాసింగ్(30), రొడామేస్త్రినగర్‌కు చెందిన డి.కార్తీక్(19), చందు(22), షాపూర్‌నగర్‌కు చెందిన చింటు(21)లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.






