జూబ్లీహిల్స్ సొసైటీ ఎన్నికలకు బ్రేక్
- కోర్టు కేసులు, పరస్పర ఆరోపణలు, ఓటర్ల జాబితాపై వివాదాలు, రాజకీయ గొడవలు
- ఎన్టీవీ, టీవీ5 మద్దతుతో రెండు వర్గాల మధ్య ప్రాక్సీ యుద్ధం?
- నిర్వహణపై శ్వేత పత్రం కూడా విడుదల చేశామన్న సొసైటీ ప్రస్తుత అధ్యక్షుడు బొల్లినేని రవీంద్రనాథ్
- పాలనపై ప్రశ్నలు, అక్రమాల ఆరోపణలు చేసిన సొసైటీ మాజీ కార్యదర్శి టీ హనుమంతరావు
- కేసు ఈనెల 29న విచారణ
హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక మైన గృహనిర్మాణ సంఘాల్లో ఒకటైన జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్‌బిల్డింగ్ సొసైటీపై నియంత్రణ కోసం జరుగుతున్న పోరు ఇప్పుడు న్యాయపరమైన, రాజకీయ తగాదాల ముసుగులో తీవ్రమైంది. సాధారణం గా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియ కోర్టు కేసు లు, పరస్పర ఆరోపణలు, ఓటర్ల జాబితాపై వివాదాలతో పూర్తిగా దెబ్బతిన్నది.
ఇదే సమయంలో ఈ పోరు ప్రముఖ మీడి యా సంస్థలు ఎన్టీవీ, టీవీ5 మద్దతుతో రెం డు వర్గాల మధ్య ప్రాక్సీ యుద్ధంగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2021 మార్చి నుంచి 2026 మార్చి వరకు జూబ్లీహిల్స్ డెవలప్‌మెంట్ సొసైటీ తరఫున అధ్య క్షుడిగా పనిచేసిన బొల్లినేని రవీంద్రనాథ్, ఏప్రిల్5, 2026న జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడటాన్ని ‘దురదష్టకరం కానీ అనివార్యం’గా అభివర్ణించారు.
కొంద రు వ్యక్తిగత ప్రయోజనాల కోసం కోర్టును ఆశ్రయించి, సమగ్ర ఎన్నికల ప్రక్రియను అడ్డుకు న్నారని ఆయన ఆరోపించారు. ఈ కేసులో తదుపరి విచారణ ఏప్రిల్ 29న జరగనుంది. అన్ని న్యాయపరమైన అడ్డంకుల మధ్య కూ డా తమ కమిటీ ఎన్నికలకు పూర్తిగా సిద్ధంగా ఉందని, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉందని రవీంద్రనాథ్ స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా, పారదర్శకత అంశం ఈ వివాదానికి కేంద్రబిందువుగా నిలిచింది.
2005 నుంచి 2020 వరకు సుమారు 15 సంవత్సరాల పాటు కేవలం 250 మంది సభ్యుల తోనే ఎన్నికలు జరిగాయని రవీంద్రనాథ్ గుర్తుచేశారు. దీనివల్ల వేలాది అసలైన సభ్యు లు ఓటు హక్కు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు 2021లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత తమ కమిటీ రెండేళ్ల పాటు కఠినమైన కేవైసీ ధ్రువీకరణ ప్రక్రియ చేపట్టిందని తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా మొదట 3,159 మంది, తరువాత 4,039 మంది సభ్యులు ధ్రువీకరించబడి ఓటర్ల జాబితాలో చేరారని వివరిం చారు.
ఇది నిజమైన సభ్యులకు న్యాయం చేయడానికి, డూప్లికేట్, అన్‌ట్రేసబుల్ పేర్ల ను తొలగించడానికి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమని జేహెచ్‌డీఎస్ వర్గం పేర్కొంటోంది. అయితే ఈ విస్తృత ఓటర్ల జాబితా ను ప్రత్యర్థి వర్గం కోర్టులో సవాలు చేసింది. కమిటీ యాదృచ్ఛికంగా సభ్యులను తొలగించి, కొత్తగా చేర్చిందని ఆరోపించింది. ఈ ఆరోపణలకు సమాధానంగా రవీంద్రనాథ్ మాట్లాడుతూ, 800 మంది సభ్యుల తొలగింపు ఒక క్రమబద్ధమైన ప్రక్రియలో భాగ మని చెప్పారు.
18 నెలలపాటు సాగిన కేవైసీ ప్రక్రియలో ప్రతి సభ్యుడిని ఆధార్, గుర్తింపు పత్రాలు సమర్పించమని కోరామని వివరించారు. కేవలం కాగితాలపైనే ఉన్న, గుర్తించ లేని పేర్లను జనరల్ బాడీ సమావేశాల్లో చర్చించి తొలగించామని తెలిపారు. కేవైసీ ప్రక్రియ సమయంలో ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని, ఇప్పుడు అకస్మా త్తుగా కోర్టును ఆశ్రయించారన్నారు. అయినప్పటికీ, నిజమైన సభ్యులు సరైన పత్రాల తో ముందుకొస్తే తిరిగి జాబితాలో చేర్చేందుకు కమిటీ సిద్ధంగా ఉందన్నారు.
రూ.42 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు
తన ఐదేళ్ల పాలనను సమీక్షిస్తూ బొల్లినేని రవీంద్రనాథ్ సొసైటీ ఆర్థిక పరిస్థితిలో జరిగిన మార్పులను ప్రస్తావించారు. 2021లో తమ కమిటీ బాధ్యతలు చేపట్టినప్పుడు సొసైటీ ఆర్థికసంక్షోభంలో ఉందన్నారు. అప్పట్లో రూ.11లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే ఉండగా, రూ.26 కోట్ల అప్పులు, రూ.10 కోట్ల లైబిలిటీలు ఉన్నాయని గుర్తుచేశారు.
మా హయాంలో రూ.107 కోట్ల టర్నోవర్ ద్వారా అప్పులన్నీ తీర్చామన్నారు. ప్రస్తుతం సొసైటీ వద్ద రూ.42 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. ‘శ్వేతప త్రం’ కూడా విడుదల చేశా మన్నారు. మా పాలనలో పారదర్శకతే ప్రధాన లక్షణమని రవీంద్రనాథ్ స్పష్టం చేశారు.
8,000 గజాల ప్రైమ్ భూమి స్వాధీనం
ఆక్రమణకు గురైన సుమారు 8,000 గజాల ప్రైమ్ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నామని రవీంద్రనాథ్ చెప్పారు. వివాదాస్పదంగా మారిన మంచిరేవుల ఫేజ్--4 హౌసింగ్ ప్రాజెక్ట్‌ను కూడా రవీంద్రనాథ్ సమర్థించారు. 35 ఏళ్లుగా ప్లాట్లు కేటాయించని నేపథ్యంలో 1,975 మంది సభ్యులు ఇంకా ఎదురుచూస్తున్నారని తెలిపారు.
ఈ సమస్యను పరిష్కరించేందుకు ఖర్చు మేరకు హైరిజ్ ప్రాజెక్ట్‌ను చేపట్టామని, అందులో 1,200 మంది ప్రస్తుత సభ్యులకు ప్రాధా న్యం ఇచ్చామన్నారు. సభ్యుల నుంచి సేకరించిన రూ.5 లక్షల నిధులు పూర్తిగా లెక్కల్లో ఉన్నాయని, రెరా జరిమానాను తప్పుడు ఆరోపణల ఆధారంగా విధించిందన్నారు. భారీ అవినీతి ఆరోపణలను ఖండిస్తూ, ఈ ప్రాజెక్ట్ సేవాభావంతో చేపట్టినదేనన్నారు.
మళ్లీ అధికారంలోకి వస్తే..
తన ప్రత్యర్థులపై ప్రతిదాడి చేస్తూ, మళ్లీ అధికారంలోకి వస్తే జూబ్లీహిల్స్ క్లబ్, సంబంధిత ఆర్థిక వ్యవహారాలపై 1991 నుంచి సీబీసీఐడీ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ చేపట్టిస్తామని రవీంద్రనాథ్ ప్రకటించారు. గత పాలనలలో జరిగిన భారీ అవినీతిని వెలికితీస్తామని ఆయన పేర్కొన్నారు. మరోసారి అవకాశం ఇస్తే సొసైటీని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని జేహెచ్‌డీఎస్ ప్యానెల్ హామీ ఇస్తోంది. మిగిలిన 1,906 మంది సభ్యులకు ఖర్చు మేరకు హైరిజ్ అపార్ట్‌మెంట్‌ల నిర్మాణం, భూముల కొనుగోలు, డిజిటల్ గవర్నెన్స్, ప్రపంచ స్థాయి ఆసుపత్రి, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ భూముల రక్షణ, క్లబ్ వ్యవస్థలో సంస్కరణలు, ‘వన్ జూబ్లీహిల్స్ వన్ కార్డ్’ విధానం అమలు వంటి లక్ష్యాలను ప్రకటించారు.
పాలనపై అక్రమాల ఆరోపణలు
జూబ్లీహిల్స్ సొసైటీ వివాదంలో మాజీ కార్యదర్శి టి.హనుమంతరావు తన వైఖరిని బలంగా సమర్థించుకుంటూ, ప్రస్తుత అధ్యక్షుడు బొల్లినేని రవీంద్రనాథ్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2005 నుంచి 2021 వరకు నరేంద్ర చౌదరి ప్యానెల్‌లో కార్యదర్శిగా పనిచేసిన ఆయన, తమ కాలం లో ఓటర్ల జాబితా చిన్నగా ఉండటానికి కార ణం నియమ నిబంధనలే అన్నారు. 2010, 2015 ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయని, 2021లో కూడా అదేవిధానం కొనసాగిందన్నారు.
కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో కోర్టు సడలింపుల వల్లే 2021లో ఒక్కసారిగా ఓటర్ల సంఖ్య 3,000 దాటిందని చెప్పారు. సుమారు 880 మంది సభ్యులను ‘అన్‌ట్రేసబుల్’ పేరుతో తొలగించడం అన్యాయ మని హనుమంతరావు విమర్శించారు. 179 మంది సీనియర్ సభ్యు ల హక్కులను రక్షించేందుకు రూ.26లక్షలు ఖర్చుచేసి న్యాయ పోరాటం చేశామన్నారు. ఈ తొలగింపులను ‘హైహ్యాండెడ్ చర్యలు’గా పేర్కొన్నారు.
మంచిరేవుల ఫేజ్-4 ఉంటుందా?
మంచిరేవుల ఫేజ్--4 ప్రాజెక్ట్‌పై హనుమంతరావు తీవ్రఆరోపణలు చేశారు. దశా బ్దాలుగా ఉన్న సభ్యులను తొలగించి కొత్త సభ్యులను చేర్చారని, ఇది సహకార నిబంధనలకు విరుద్ధమన్నారు. ప్రాజెక్ట్‌ను 1,900కు పైగా ఫ్లాట్లతో ప్రీమియం హైరిజ్‌గా ప్రచా రం చేస్తున్నప్పటికీ, సొసైటీకి భూమిపై యాజమాన్యం లేదని, డెవలపర్‌గా కూడా వ్యవహరించడంలేదని తెలిపారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఫ్లాట్ల విక్రయం లేదా అడ్వాన్స్ లు సేకరించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ నమోదు లేకుండా సభ్యుల నుంచి రూ.5లక్షలు(అదనంగా నగదు) వసూలుపై సందేహాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు కొత్త సభ్యుల చేర్పుపై స్టే విధించి, తదుపరి ఒప్పందాలపై కూడా ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు. ప్రస్తు తం ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయిన స్థితిలో ఉంద ని ఆరోపించారు.
ఎన్నికలను తాము అడ్డుకోలేదు
సొసైటీ ఎన్నికలను తాము అడ్డుకోలేదని హనుమంతరావు స్పష్టం చేశారు. ఫిబ్రవరి 11, 2026న విడుదలైన ఓటర్ల జాబితాపై అసంతప్తి వ్యక్తం చేసిన సభ్యులే కోర్టును ఆశ్రయించారన్నారు. మొత్తం 4,976 మంది సభ్యులతో ఉన్న అసలు జాబితాపైనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
వర్గాల మధ్య ఆధిపత్య పోరు!?
1962లో స్థాపించబడిన జూబ్లీహిల్స్ సొసైటీ మొదట 1,398 ఎకరాల్లో విస్తరించి ఉండగా, ప్రస్తుతం 1,167.27 ఎకరాలకు పరిమితమైంది. హైదరాబాద్‌లో అత్యంత విలు వైన ప్రాంతంలో ఉన్న ఈ సొసైటీకి భారీ ప్రాధాన్యం ఉంది. 4,976 మంది సభ్యులతో ఉన్న ఈ సంస్థపై నియంత్రణ అంటే కోట్లాది ఆస్తులపై ఆధిపత్యం సాధించినట్లే. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లో జరుగుతున్నది కేవలం సొసైటీ ఎన్నికల పోరేకాదని అది ఆధిపత్య పోరుగా మారింది. ఇక ఎన్టీవీ, టీవీ5 మద్దతు ఈ వ్యవహారాన్ని మరింత ఉత్కంఠభరితంగా మార్చింది.
ఈపరిస్థితుల్లో సొసైటీ నిర్వహణపై అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవా లని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, న్యాయమూర్తులు, జర్నలిస్టు లు లేదా చార్టర్డ్ అకౌంటెంట్లతో స్వతంత్ర కమిటీ ఏర్పాటుచేసి సొసైటీని పారదర్శకం గా నిర్వహించాల్సిన అవసరం ఉందని పలువురు సభ్యులు సూచిస్తున్నారు.






