calender_icon.png 7 December, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమరగిరి ఐలాండ్ కు బ్రేక్ !

07-12-2025 12:08:06 AM

-రెవెన్యూ, అటవీ శాఖల మధ్య భూ వివాదం

-రూ.68.10 కోట్ల వినియోగం ప్రశ్నార్థకం

-అమరగిరి టూరిజంపై కమ్ముకున్న నీలినీడలు 

-ఫారెస్ట్ శాఖ అడ్డంకులతో మల్లేశ్వరానికి మళ్లింపు

 బొడ్డుపల్లి మల్లయ్య, నాగర్ కర్నూల్, విజయక్రాంతి; నల్లమల అటవీప్రాంతంలో కృష్ణానదితీరంలో ప్రకృతి సహజ అందాల మధ్య కొలువైన అమరగిరి టూరిజం అభివృద్దికి బ్రేక్ పడింది. రెవెన్యూ శాఖ పరిధిలోని అమరగిరి ఐలాండ్లో రూ.48 కోట్లతో టూరిజం డెవలప్మెంట్ కొరకు జూన్ నెలలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. అమరగిరి ఐలాండ్ కోసం నదిలోబోట్ ద్వారా, కాలి నడకన ఫారెస్ట్ భూముల నుంచి వెళ్లేందుకు అవకాశం ఉంది.

ఈ భూములు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ జోన్ పరిధిలోకి వస్తాయని ఈ ప్రాంతంలో టూరిజం పనులు చేయడానికి వీల్లేదంటూ ఫారెస్ట్ అధికారులు అభ్యంతరం తెలిపారు. దీంతో అమరగిరి ఐలాండ్ పర్యాటకానికి బ్రేక్ పడింది. సాస్కీ(స్పెషల్ అసిస్టెన్స్ టూ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఫర్ క్యాపిటల్ ఇన్వె స్ట్మెంట్) స్కీంలో నల్లమల టూరిజానికి రూ.68.10 కోట్లు మంజూరయ్యాయి. నల్లమల దేవభూమిగా పిలిచే అమరగిరిని క్లస్టర్ 2లో చేర్చిన ప్రభుత్వం సోమశిలలో బోటింగ్ జెట్టి, అమరగిరి ద్వీపంలో బోటింగ్ జెట్టి, కాటేజీలు, స్విమ్మింగ్ పూల్స్, కాఫెటేరియా, స్పా, వెల్నె స్ సెంటర్, ఇండోర్ అండ్ ఔట్ డోర్ గేమ్స్, ఇతర సదుపాయాల కో సం రూ.48.50 కోట్లు కేటాయించింది.

ఈ ఏడాది జూన్ నెలలోమం త్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, కలెక్టర్ బాదావత్ సంతోష్ తదితరులు అమరగిరి ద్వీపంలో ఆర్బాటంగా శంకుస్థాపన చేశారు. అమరగిరి అందాలను బయటి ప్రపంచానికి తెలిసేలా నలుమూలల నుంచి అందరికి ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి ప్రకటించారు. అమరగిరి దశాదిశ మారుతుందని స్థానిక చెంచులు, గిరిజనులు, బీసీలు మురిసిపోయారు. కానీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి రావడంతో అనుమ తులు లేక ఈ పనులను మల్లేశ్వరంకు మళ్ళించినట్లు తెలుస్తోంది.

అటవీ శాఖ అడుగు పడటంతో... 

అమరగిరి, సోమశిల తదితర ప్రాంతాలలో టూరిజం అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్స్ సిద్దం చేసి మంత్రి జూపల్లి చేతుల మీదుగా శంకుస్థాపన చేసేంత వరకు సైలెంట్గా ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ భూములు ఫారెస్ట్ రిజర్వ్ పరిధిలోకి వస్తాయంటూ ఎంట్రీ ఇచ్చింది. నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఏరియాలో కి వచ్చే ఈ ప్రాంతంలో ఎటువంటి టూరిజం డెవలప్మెంట్ పనులు చేపట్టకూడదంటూ డిఎఫ్‌ఓ రోహిత్ గోపిడి జిల్లా కలెక్టర్ కు లేఖ రాసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రెవెన్యూ అధికారులు మాత్రం ఐదె కరాల అమరగిరి ఐలాండ్ భూమి తమదేనని దానికి సంబంధించిన రికార్డులు స్పష్టంగా ఉన్నాయని చెబుతున్నారు.

అమరగిరి ఐలాండ్కు వెళ్లేందుకు రోడ్డు కోసం కొంత ఫారెస్ట్ భూమి అవసరం అవుతుందేమోనని దానికి ఇంత రాద్దాంతం అవసరమా అని స్థానికులు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. ఏటిఆర్ పరిధిలోకి వచ్చే కృష్ణాతీర ప్రాంతం లో రాష్ట్రేతరులు దర్జాగా గుడిసెలు వేసుకుని అన్ని పనులు చక్కబెట్టుకుంటున్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు ఒక్కనాడు వాళ్లను అడ్డుకున్న పాపాన పోలేదని స్థానికులు మండిపడుతున్నారు.

ఫారెస్ట్ డిపార్టమెంట్ అభ్యంతరాలతో రూ.48 కోట్ల విలువ చేసే టూరిజం డెవలప్మెంట్ పనులను ఇతర చోటుకి మళ్లించడం మూర్ఖత్వమని కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన వివిధ రాజకీయ నేతలు మండిపడుతున్నారు.అమరగిరి పర్యాటక అభివృద్దిలో ఎదురవుతున్న అడ్డంకుల విషయంలో అటవీశాఖ మంత్రి, ముఖ్యమంత్రితో చర్చించాలని ఎంపీ మల్లు రవిని అమరగిరి వాసులు కోరుతున్నారు. కానీ వచ్చిన నిధులను వెనక్కి పంపడం ఎందుకంటే టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అడ్డంకుల పేరుతో ఇతర ప్రాంతానికి మళ్ళించడం ఏంటని అమరగిరి ప్రాంతవాసులు మండిపడుతున్నారు.