07-12-2025 12:01:54 AM
-ఆదిలాబాద్ జిల్లా మారుమూల గ్రామంలో..
-సందర్శకుల చూపు ‘వడ్డాడి’ వైపు
ఆదిలాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి); అదొక మారుమూల గ్రామం.. ఓ వైపు చుట్టు పచ్చని పంట పొలాలు.. మరోవైపు జలాశయం.. మధ్యలో ఉన్న చిన్న గ్రామంలో వందల యేళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయం. పాడి పంటలతో సంమృద్ధిగా ఉన్న ఈ గ్రామంలో ఆధ్యాతికత సైతం వెలివిరుస్తోంది. ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది. ఇన్ని విశేషాలు కలిగిన ఈ చిన్న వడ్డాడి గ్రామం.. ప్రస్తుతం పర్యాటక శోభను సంతరించుకొని సందర్శకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని వడ్డాడి గ్రామం.. ఒకవైపు నిండుకుండను తలపించే వడ్డాది జలాశయం. మూడు వైపు లా పచ్చని పంట పొలాలతో అలలారుతున్న గ్రామం. సుమారు 300 నివాస గృహాలు ఉన్న ఈ గ్రామ జనాభా రెండు వేల వరకు ఉంటుంది. పేరుకు ఇది చిన్న గ్రామమే అయినా ఎన్నో విశేషాలను కలిగి ఉంది. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. పాడిపరిశ్రమ కూడా విస్తరించి ఉంది. ఈ గ్రామంలో వందల సంవత్సరాల క్రితం స్వయంభూ వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో ఈ గ్రామానికి ప్రత్యేకత ఏర్పడింది.
కోరి వచ్చిన భక్తుల పాలిట కొంగుబంగారమైన వెలుగొందుతున్న ఈ వడ్డాది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకొని వెళతారు. ప్రతి సంవత్సరం ఈ ఆలయం శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి శనివారం ఈ ఆలయంలో భజనా కార్యక్రమం, నిత్యాన్నదానం కొనసాగుతోంది. గ్రామస్తులంతా ఐక్యంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడతారు.
‘మత్తడి’ పరిసరాలు ఆహ్లాదకరం
ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాశస్తి కలిగి ఉన్న ఈ వడ్డాడి గ్రామం పర్యాటకంగా కూడా ఖ్యాతి గాంచింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వడ్దాడి గ్రామంలోని మత్తడి వాగు నిండుకుండలా మారింది. నిత్యం ఎందరో మంది ఈ మత్తడి వాగులో చేపలు పట్టి ఉపాధిని సైతం పొందుతున్నారు. ఈ మత్తడి వాగు ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు అందుతున్న సాగునీటితో రైతులు పంటలను సాగు చేస్తు న్నారు. వారాంతాల్లో, సెలవు రోజుల్లో ఈ ప్రాజెక్టును చూసేందుకు ఎక్కడెక్కడి నుండో పర్యాటకులు తరలివస్తున్నారు. జలాశయాన్ని ఆనుకొని ఉన్న కొండలు గుట్టలు సుందరంగా, ఆహ్లాదకరంగా దర్శనమిస్తాయి. ప్రాజెక్టు ఆయకట్టుపై నుంచి చూస్తే గ్రామం పచ్చదనం తో కనువిందు చేస్తుంది.
కడ్డీ తంత్రీ వాయిద్యానికి గుర్తింపు...
ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా ప్రత్యేకతలను కలిగి ఉన్న ఈ గ్రామంలో తుమ్మపూరి రామస్వామి వంటి అరుదైన కడ్డీ తంత్రీ వాయిద్య కళాకారుడు కూడా ఉండేవాడు. ఆయన గతించడంతో ఆ వాయిద్యం కూడా మూగబోయింది. దీంతో ఈ గ్రామంలో కడ్డీ తంత్రీ వాయిద్యనికి గుర్తింపుగా నిలుస్తుంది. అటు ఆధ్యాత్మికంగా, ఇటు పర్యాటకంగా తమ గ్రామం పేరు జిల్లాలో మారుమోగిపోతుండటంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.