జూన్ నుంచి బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అమలు
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉదయాన్నే పోషకాహారం
ఆకలి బాధలకు చెక్.. హాజరు శాతం పెరుగుదలకు ప్రభుత్వం లక్ష్యం
వనపర్తి, మే 14 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జూన్ నెల నుంచి బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకం అమలులో ఉండగా, ఇకపై ఉదయం అల్పాహారం కూడా అందించనుండటంతో పేద కుటుంబాల పిల్లలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థులు ఆకలితో పాఠశాలకు రావద్దనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. జూన్ 11 నుంచి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఆకలి సమస్యకు పరిష్కారం
గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది విద్యార్థులు ఉదయం అల్పాహారం లేకుండానే పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో విద్యార్థుల్లో అలసట, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కొత్తగా అమలుకానున్న బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ద్వారా విద్యార్థులకు పోషకాహారం అందడంతో చదువుపై ఆసక్తి, హాజరు శాతం పెరుగుతాయని భావిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలపై మరింత నమ్మకం
ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం, మెరుగైన మౌలిక వసతులు అందిస్తుండగా, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కూడా చేరడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇది పెద్ద ఊరటనివ్వనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని విద్యాశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
పోషకాహారంతో ఆరోగ్యవంతమైన విద్యార్థులు
విద్యార్థులకు అందించే అల్పాహారంలో పోషక విలువలు ఉండేలా ప్రత్యేక మెనూ రూపొందించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. పిల్లల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు చదువులోనూ మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.






