24 July, 2026 | 11:11 PM

మెజారిటీలో రికార్డుల బద్దలు

05-06-2024 01:44 AM

న్యూఢిల్లీ, జూన్ 4: సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన పలువురు అభ్యర్థులు భారీ మెజారిటీ సాధించి రికార్డులను బద్దలు కొట్టారు. ఇండోర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన సిట్టింగ్ ఎంపీ శంకర్ లల్వానీ.. తన సమీప ప్రత్యర్థిపై ఏకంగా 11.72 లక్షల ఓట్ల మెజారిటీతో దేశంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థిగా చరిత్ర తిరగరాశా రు. మొత్తం ఆయనకు 12,26,751 ఓట్లు పోలవ్వగా.. రెండో స్థానంలో నోటాకు 2,18,674 ఓట్లు వచ్చాయి. ఇక ఆయన సమీప ప్రత్యర్థికి 51 వేల ఓట్లు వచ్చాయి. 

8 లక్షల ఓట్లతో శివరాజ్ రికార్డు..

మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశ స్థానం నుంచి పోటీ చేశారు. ఆయన 8,21,408 ఓట్ల మెజారిటీతో దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందిన రెండో వ్యక్తిగా రికార్డులకెక్కారు. ఆయనకు మొత్తం 11,16,460 ఓట్లు సాధించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గుజరాత్‌లోని గాంధీనగర్ స్థానం నుంచి తన సమీప ప్రత్యర్థిపై 7.44 లక్షల మెజారిటీతో గెలుపొందారు. ఆయనకు మొత్తం 10.10 లక్షల ఓట్లు వచ్చాయి. గుజరాత్‌లోని నవసరిలో బీజేపీ అభ్యర్థి సీఆర్ పాటిల్ 6.89 లక్షల మెజారిటీ సాధించారు. అస్సాంలోని ధుబ్రీ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రకిబుల్ హుస్సేన్ 6,72,813 ఓట్ల మెజారిటీ సాధించారు. ఆయనకు మొత్తం 9,93,492 ఓట్లు వచ్చాయి.