24 July, 2026 | 11:58 PM

వికాస్ నినాదంతోనే హ్యాట్రిక్ సాధించాం

05-06-2024 01:42 AM

నాలుగు రాష్ట్రాల్లో క్లీన్‌స్వీప్ చేశాం

అంసెబ్లీ ఎన్నికల్లోనూ గొప్ప విజయాలు దక్కాయి

భారత్ ప్రగతి పథంలో దూసుకుపోతోంది

ప్రధానమంత్రి నరేంద్రమోదీ

న్యూఢిల్లీ, జూన్ 4: మన దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా ముందుకు వెళుతోందని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. తాము చేపట్టిన పనుల వల్ల భారత్ ప్రగతి పథంలో దూసుకుపోతోందని తెలిపారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. వికాస్ నినాదంతోనే తాము మూడు సార్లు అధికారంలోకి వచ్చామని స్పష్టం చేశారు. 1962 తర్వాత ఏ ప్రభుత్వమూ హ్యాట్రిక్ కొట్టలేదని గుర్తుచేశారు. ఎన్‌డీఏ సేవలు చూసే ప్రజలు మరోసారి పట్టం కట్టారని చెప్పారు.

2014కు ముందు అన్ని పేపర్లలో కుంభకోణాలే కనిపించేవని మోదీ ఆరోపించారు. తాము రాకముందు ప్రజలు నిరాశ, నిస్పృహల్లో ఉండేవారని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక 4 కోట్ల మందికి పక్కా ఇళ్లు, 12 కోట్ల మందికి సురక్షిత తాగునీరు అందించామని పేర్కొన్నారు. మన ఎన్నికల ప్రక్రియ చూసి ప్రజలంతా గర్వపడుతున్నారని మోదీ ఉద్ఘాటించారు. మన ప్రజాస్వామ్యానికి సార్వత్రిక ఎన్నికలు పట్టుగొమ్మలని తెలిపారు. మన ఎన్నికలను ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తితో చూశాయని చెప్పారు. దేశంలోని ప్రతి ఓటరుకు అభినందనలు తెలిపారు. 

రాష్ట్రాల్లోనూ గొప్ప విజయాలు..

బీజేపీని కోట్లమంది మహిళలు ఆశీర్వదించారని మోదీ తెలిపారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మహిళలు భారీ ఎత్తున ఓటింగ్‌లో పాల్గొని గత రికార్డులను తిరగరాశారని కొనియాడారు. తెలంగాణలో తమ సీట్లు రెండింతలు పెరిగాయని వెల్లడించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఢిల్లీలో క్లీన్ స్వీప్ చేశామన్నారు. రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఎన్‌డీఏ సత్తా చాటిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు నేతృత్వంలో గొప్ప విజయం సాధించామని చెప్పారు. ఒడిశాలో పూరీ జగన్నాథుడి ఆశీస్సులతో విజయం దక్కిందని పేర్కొన్నారు.

ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు. ఈ సందర్భంగా ఏపీ, ఒడిశా ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అరుణాచల్‌ప్రదేశ్, సిక్కింలోనూ చరిత్ర సృష్టించామన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. దేశాభివృద్ధి కోసం ప్రజలు ఎన్‌డీఏకు మరోసారి పట్టం కట్టారని, మోదీ నేతృత్వంలో మూడోసారి అధికారంలోకి వస్తున్నామన్నారు. స్వార్థపూరిత కూటముల ప్రయత్నాలు ఫలించలేదని పేర్కొన్నారు. బెంగాల్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ తగలలేదని, తాము ఏ స్థాయి నుంచి ఎక్కడికి వచ్చామో గమనించాలని సూచించారు.