calender_icon.png 9 January, 2026 | 6:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘అధికారి’కంగా వసూలు..?

08-01-2026 01:24:10 AM

జిల్లాలో విచ్చలవిడిగా లంచాలు

అడిగింత ఇవ్వకపోతే పనులు జరగవు

లక్షలు ఇచ్చి వచ్చాం.. కోట్లు సంపాదించాలి కదా..

సంవత్సరంలో ఇచ్చింది పుచ్చుకోవాల్సిందే..

భయపడుతూనే నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్న పోలీసులు 

జిల్లా స్థాయిలో అవినీతి 

అధికారులదే హవా..

సిద్దిపేట, జనవరి 7 (విజయక్రాంతి):  సిద్దిపేట జిల్లాలో అధికారులు విచ్చలవిడిగా లంచాలు తీసుకుంటున్నారు అనే చర్చ జరుగుతుంది. లక్షలు ఇచ్చి సిద్దిపేట జిల్లాలో పోస్ట్ పొందుతున్నారు. దాంతో జిల్లాకు వచ్చిన అధికారులు కింది స్థాయిలోనీ అధికారులను పిండించి, బెదిరించి, చిన్న చిన్న తప్పులను సాకు చూపి అందినకాడికి వసూలు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. అధికారి పరిధిలోని కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేయాలంటే చెప్పినంత ఇవ్వాల్సిందే లేదంటే చెక్కులు సదరు అధికారి డ్రాలోనే ఉంటుంది.  ఇలా జిల్లాకు వచ్చిన అధికారులు అవినీతికి పాల్పడుతూ అందినకాడికి దోచుకుంటున్నారనీ గుసగుసలు వినిపిస్తున్నాయి.

గత ప్రభుత్వంలో స్థానిక పలుకుబడితో అర్హత లేకపోయిన జిల్లా అధికారిగా బదిలీపై వచ్చిన సదరు జిల్లా స్థాయి ఉద్యోగి పొద్దంతా తనిఖీల పేరుతో పర్యటించి సాయంత్రం జిల్లా కార్యాలయంలోనీ తన ఛాంబర్‌లో కూర్చొని లావాదేవీల చర్చలు చేస్తారని తెలిసింది. డిప్యూటేషన్లు, ఉద్యోగుల సర్దుబాటు, ఖాళీగా ఉన్న పోస్టులను ఔట్ సోర్స్ ద్వారా భర్తీ చేయడం, భవనాలు నిర్మాణం ఇలా ప్రతి పనికి పైకం తీసుకుంటారని ఆ శాఖ ఉద్యోగులు  అసహ్యం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల సర్దుబాటులో లక్షలు చేతులు మారాయని తెలిసింది. సదరు అధికారికి సిద్దిపేట జిల్లాలో పోస్టింగ్ ఇప్పించిన నాయకుడు చేసిన రికమండేషన్స్ పట్టించుకోవడంలేదని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.  

కలెక్టరేట్‌లోనే... 

కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన హైమావతి జిల్లా వ్యాప్తంగా విసృతంగా పర్యటించి ప్రభుత్వ శాఖల ఉద్యోగులను అప్రమత్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా పాఠశాలలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీలు చేస్తూ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఉద్యోగుల పనితీరులో మార్పు రావడం లేదని ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. కలెక్టర్ కార్యాలయంలో అధికారులు లంచాలు తీసుకుంటూ జిల్లాకు మచ్చ తీసుకొస్తున్న వారిపై కలెక్టర్ దృష్టిసాదించకపోవడం బాధాకరమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ దాడులు జరుగుతున్నప్పటికీ సిద్దిపేట జిల్లాలో యదేచ్చగా మామూలు వసూలు చేసుకుంటున్నారని విస్తృతంగా చర్చ సాగుతోంది. జిల్లాకు పోలీస్ కమిషనర్‌గా వచ్చిన విజయ్ కుమార్ శాఖను జల్లెడ పడుతున్నారని పోలీస్ శాఖ ఉద్యోగులు మామూళ్ల జోలికి పోవడం లేదంటూ చర్చ జరుగుతుంటే కొంతమంది పోలీస్ అధికారులు ఎదేచ్ఛగా మామూలు వసూలు చేస్తున్నారు. కొత్తగా వైన్ షాపులు దక్కించుకున్న వారి నుంచి ప్రతి నెల రావాల్సిన వాటాలు తీసుకుంటున్నారని విశ్వాసనీయ సమాచారం. ఆప్కారి శాఖలో అటెండర్ నుంచి మంత్రి వరకు మామూళ్ల పేరుతో విచ్చలవిడిగా దోచుకుంటున్నారని మద్యం షాపు నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పోలీసులు, ఆప్కారి శాఖ, టాస్క్ ఫోర్స్, విజిలెన్స్ ఇలా అధికారుల రూపంలో మద్యం దుకాణాలను లూటీ చేస్తున్నారనీ, తమకు టెండర్ ద్వారా దుకాణం దక్కించుకున్న తృప్తి కన్నా మామూలు చెల్లించడమే దుఃఖంగా మారిందని అంతంతగా వ్యాపారం సాగుతున్న నిర్వాహకులు బోరున విలపిస్తున్నారు. ఎక్సైజ్ శాఖలోని ఓ సిఐ ఆయన పరిధిలోని దుకాణాలకు పర్మిట్ రూమ్ ఎవరికి ఇవ్వాలో ఆయనే డైరెక్షన్ చేశారనీ, ఆ అధికారి సూచించిన వారికి ఫార్మేట్ రూమ్ ఇవ్వకపోతే వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని దుకాణం నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని మద్యం దుకాణాలను విక్రయించాలంటూ వారిపై ఒత్తిడి చేసినట్లు తెలిసింది. సిఐ సూచించిన వారికి నిర్ణయించిన ధరకు దుకాణం విక్రయించనీ వారికి నిబంధనల పేరుతో ప్రతి నెల మామూళ్ళు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. 

సంవత్సర క్రితం డిప్టేషన్ పై సిద్దిపేట జిల్లా అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఓ శాఖ అధికారి ఆయన పరిధిలోని ఒక్కొక్క డివిజన్ నుంచి సుమారు రూ.10 లక్షలకు పైగా వసూలు చేసుకున్నారని ఆ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల ఆ అధికారి డిప్టేషన్ రద్దు చేస్తూ పూర్వపు జిల్లాకు వెళ్లాలంటూ ఆదేశాలు వస్తే తాను వెళ్ళనని ఉన్నతాధికారులను సంప్రదించినట్లు తెలిసింది. నిబంధనల పేరుతో తనిఖీలు చేసి చిన్న చిన్న కారణాలతో సీజ్ చేయడం ఒక అధికారి ప్రత్యేకత. సీజ్ చేసిన ఆస్పత్రులు ఓపెన్ చేసుకోవాలంటే ఆయన బినామీల ద్వారా ముడుపులు చెల్లించాల్సిందే. అడిగినంత ఇవ్వకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తారంటూ బినామీ వసూలుదారులు హెచ్చరిస్తుంటారు. ఇలా సిద్దిపేటకు వచ్చిన ప్రతి అధికారి ఎంతోకొంత ముట్టజెప్పి సిద్దిపేట జిల్లాలో పోస్టింగ్ పొందుతూ విచ్చలవిడిగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.