పిల్లర్లతో కూడిన వంతెనలు నిర్మించాలి
- మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
- హయత్‌నగర్ వద్ద జాతీయ రహదారి విస్తరణ పనుల పరిశీలన
ఎల్బీనగర్, ఆగస్టు 24: జాతీయ రహదారి విస్తరణతో భవిష్యత్‌లో ఇబ్బందులు రాకుండా పనులు చేపట్టాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు నిర్మించనున్న ఫ్లుఓవర్ల నిర్మాణాలతో భవిష్యత్‌లో ఇబ్బందులు వస్తాయని, పిల్లర్లతో కూడిన వంతెనలను నిర్మిస్తే పెద్దగా ఇబ్బంది ఉండదని గతంలో బీజేపీకి కార్పొరేటర్లు పలుమార్లు ఆందోళన చేపట్టారు. దీంతోపాటు కేంద్ర మంత్రి గడ్కరీ, ఎంపీ ఈటల రాజేందర్‌కు వినతిపత్రాలు అందజేశారు. ఈ మేరకు ఎంపీ ఈటల రాజేందర్.. వనస్థలిపురం నుంచి హయత్‌నగర్ వరకు నిర్మించనున్న ఫ్లుఓవర్ల ప్రదేశాలను శనివారం కార్పొరేటర్లు కొప్పుల నర్సింహారెడ్డి, నవజీవన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ఎల్బీనగర్ నుంచి మల్కాపూర్ వరకు చేపట్టిన విస్తరణ పనులను తర్వగా పూర్తి చేయాలన్నారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని అండర్ పాస్‌లు, ఫ్లుఓవర్ల నిర్మాణాలు చేపట్టాలని నేషనల్ హైవే అథారిటీ అధికారులకు సూచించారు. పనామా చౌరస్తా, హయత్‌నగర్‌లో అండర్‌పాస్ నిర్మాణాలతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని, ఆయా ప్రాంతాల్లో వ్యాపారాలు నిలిచిపోయే ప్రమాదం ఉందని కార్పొరేటరు తనదృష్టికి తేవడంతో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో ఇదివరకు ఈ విషయమై చర్చించానని ఎంపీ తెలిపారు. ఇండ్లు, షాపులు ఉన్నవారికే నష్టపరిహారం ఇస్తున్నారని.. ఖాళీ ప్లాట్లు ఉన్నవారికి పరిహారం ఇవ్వడం లేదని.. అందరికీ నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.
వనస్థలిపురం, పనామా, హయత్‌నగర్‌లో ఫ్లుఓవర్లు, ఇతర అభివృద్ధి పనులకు రూ.250 కోట్ల నిధులను కేంద్రమంత్రి మంజూరు చేశారని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. కార్యక్రమంలో జాతీయ రోడ్డు రవాణాశాఖ అధికారులు, అడిషనల్ డైరెక్టర్ జనరల్(ఏడీజీ) రాజీవ్‌సింగ్, రీజినల్ ఆఫీసర్ (తెలంగాణ) ఎస్‌కే.పుష్ప, హైదరాబాద్ అధికారి ధర్మారెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటేశ్వర్‌రెడ్డి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శరత్‌చంద్ర, బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, కార్పొరేటర్లు కొప్పుల నర్సింహారెడ్డి, నవజీవన్‌రెడ్డి, లచ్చిరెడ్డి, చింతల అరుణాసురేందర్ యాదవ్, నాయకులు రవీందర్‌రెడ్డి, బండారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.






