ట్రాక్టర్ ఢీకొని అన్నదమ్ముల మృతి
- కాలేజీ అడ్మిషన్ పనులు ముగించుకొని వస్తుండగా ప్రమాదం
- దుమ్ముగూడెం మండలం చిన్నబండిరేవులో ఘటన
- గొంపల్లి గ్రామంలో విషాదం
చర్ల, జూన్ 5, (విజయక్రాంతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం గొంపెల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద ఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చర్ల మండలం గొంపెల్లి గ్రామానికి చెందిన చుంచు సంతోష్ కుమార్ (22), చుంచు సాయి చరణ్ (16) భద్రాచలంలో కాలేజీ అడ్మిషన్ పనులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తున్నారు.
దుమ్ముగూడెం మండలం చిన్నబండిరేవు సమీపంలో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ బలంగా ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్డడంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్, ఇన్‌స్పక్టర్ వెంకటప్పయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు మరణించడంతో గొంపెల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.






