29 July, 2026 | 9:04 PM

గుండ్ల మాచునూర్‌కు మినీ స్టేడియం కేటాయించాలి

29-07-2026 08:23 PM

- 700 మంది విద్యార్థులకు.... యువతకు క్రీడ మైదానం కావాలి

- మంత్రి వివేక్ వెంకటస్వామికి సర్పంచ్ శ్రీహరి వినతి

నర్సాపూర్,(హత్నూర): హత్నూర మండలం గుండ్ల మాచునూర్ గ్రామానికి మినీ స్టేడియం ఏర్పాటు కోసం స్థలం కేటాయించాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని గ్రామ సర్పంచ్ శ్రీహరి బుధవారం హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

గ్రామంలోని మోడల్ పాఠశాలలో సుమారు 700 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారని, గ్రామంలో క్రీడలపై ఆసక్తి ఉన్న యువత అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ సరైన క్రీడా మైదానం లేక ప్రతిభ కనుమరుగవుతోందని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సర్వే నంబర్ 237లో ఉన్న సుమారు ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని మినీ స్టేడియం, క్రీడా మైదానం కోసం కేటాయించాలని కోరారు. వినతిపై మంత్రి వివేక్ వెంకటస్వామి సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సర్పంచ్ శ్రీహరి తెలిపారు.