02-11-2025 12:15:21 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 1 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ లు రెండూ మజ్లిస్ బానిసలే అని, కేసీఆర్‌ది కుటుంబ పాలన అయితే ప్రజలను దగా చేసిన పాలన రేవంత్‌రెడ్డిది అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బోరబండలో జరిగిన బీజేపీ మహిళా మోర్చా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలూ ఏఐ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ముం దు మోకరిల్లి, ఆయనకు బానిసలుగా పనిచేస్తున్నాయని ఘాటుగా విమర్శించారు. గత పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ప్రజలను పూర్తిగా మోసం చేశారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. హైదరాబా ద్‌ను సింగపూర్, ఇస్తాంబుల్ చేస్తానని చెప్పి, చివరికి ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు.
బంగారు తెలంగాణ నినాదంతో అధికారంలోకి వచ్చి, తన కుటుంబా న్ని మాత్రమే బంగారం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి రెండే ళ్లు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయిందని కిషన్‌రెడ్డి విమర్శించారు. “జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కనీసం వీధి దీపాలు కూడా వేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది.
యువతకు ఇస్తామన్న రూ.4 వేల నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, స్కూటీలు, తులం బంగారం ఏమయ్యాయి?” అని ప్రభుత్వాన్ని నిలదీశారు. విద్యా భరోసా కార్డుల పేరుతో విద్యార్థులను, పావలా వడ్డీ రుణాల పేరుతో మహిళలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన మహిళలపై అక్రమ కేసులు బనాయిస్తూ ఈ రెండు పార్టీలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. ఉప ఎన్నికలో జూబ్లీహిల్స్ అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసం బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కిషన్‌రెడ్డి కోరారు.