4 May, 2026 | 8:09 PM

దండేపల్లిలో బీఆర్ఎస్, రైతుల ధర్నా

04-05-2026 06:32 PM

- రైతులు పండించిన పంటలు కొనుగోలు చేయాలని డిమాండ్

దండేపల్లి,(విజయక్రాంతి): జిల్లాలో రైతులు పండించిన పంటలను ఎలాంటి కోతలు, షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమ వారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ మాట్లాడుతూ యాసంగి సీజన్ లో రైతులు పండించిన వడ్లు, మొక్కజొన్న పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు.

మంచిర్యాల నియోజక వర్గంలో రైతులు పండించిన వరి ధాన్యానికి కొనుగోలు కేంద్రాల నిర్వహకులు బస్తాకు మూడు కిలోలు కటింగ్ చేస్తామని చెప్తున్నారని, బస్తాలు కాంటా అయిన తర్వాత బస్తాలను తరలించడానికి బ్యాగుకు రెండు రూపాయల చొప్పున ఇవ్వాలని లారీ డ్రైవర్లు అడుగుతున్నారని, దీనిని వెంటనే ఆపాలని, మొక్కజొన్న పంట కొనుగోలు నిర్వహకులు ఎకరానికి 26 క్వింటాలు మాత్రమే తీసుకుంటున్నారని, ఎలాంటి షరతు లేకుండా ఎకరానికి 40 క్వింటాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కోతలు ఆపాలి.. కొనుగోళ్లు జరపాలి...

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పెద్ద ఎత్తున దోచుకునే ప్రయత్నం మొదలు పెట్టిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు బస్తాకు మూడు కిలోల చొప్పున కట్టింగ్ అవుతాయని రైతులకు ముందుగానే చెప్తున్నారని, అది వీరెలా చెబుతారని ప్రశ్నించారు. దోచుకునుడు ఆపాలని, ఎలాంటి తరుగు లేకుండా 40 కిలోలు, గన్ని బ్యాగు వేసి కాంటా వేయాలన్నారు.

కాంటా అయిన తర్వాత పంటను తరలించడానికి బ్యాగుకు 2 రూపాయల చొప్పున అడుగుతున్నారని, అవి జమ చేసి ఎవరికి ఇస్తున్నారని మండిపడ్డారు. గతంలో రెండు రూపాయలు అనేది ఎప్పుడూ తీసుకోలేదని, ఇది అవినీతికి నిలువెత్తు నిదర్శనం కదా! అని ప్రశ్నించారు. వడ్లకు ఏ గ్రేడ్ కు, బి గ్రేడ్ కు క్వింటాలుకు 20 రూపాయల తేడా ఉంటుందని, కానీ మొత్తం వడ్లను బి గ్రేడ్ కింద కొంటున్నారని, దీని వల్ల రైతులు పెద్ద మొత్తంలో నష్టపోతున్నారని, క్వింటాలుకు 20 రూపాయలు మిల్లర్ కోసమా, అధికారులకా, నాయకుల కోసమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ప్రకటించినట్టుగా వడ్లకు (దొడ్డు వడ్లు, సన్నం వడ్లు అనే తేడా లేకుండా) క్వింటాల్ కి 500 రూపాయలు బోనస్ ఇవ్వాలన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు రాజుల బతికిన కాలం చూసాం కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రైతుల పండించిన పంటను ఎలాంటి షరతులు, తరుగు లేకుండా కొనుగోలు చేయాలని లేని పక్షంలో రైతుల తరపున బిఆర్ఎస్ పార్టీ పోరాడుతుందన్నారు. అనంతరం వివిధ డిమాండ్లతో క‌ూడిన వినతి పత్రాన్ని దండేపల్లి తహశీల్దార్ కి అందజేశారు.