29-09-2025 01:47:09 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) సిద్దమవుతుంది. గత వారమే అన్ని జిల్లాల నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లకు పూర్తి భాద్యతలిచ్చారు. బీఆర్ఎస్ అధిష్ఠానం అభ్యర్థులను ఫైనల్ చేసే బాధ్యత ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లకు ఇచ్చింది. స్థానిక సమస్యలను లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేయాలని సూచించింది. రైతుల సమస్యలు, యూరియా ఇబ్బందులను హైలెట్ చేయాలని పార్టీ అధినేత కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) బీఆర్ఎస్ నాయకులకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో హామీలు ఇచ్చి, కాంగ్రెస్ నెరవేర్చని హామీలపై బాకీ కార్డులను ఇంటింటికీ చేర్చేందుకు పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యప్తంగా ప్రచారం చేసేందుకు బీఆర్ఎస్ ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కాగా, రాష్ట్ర ఎన్నికల సంఘం(Telangana State Election Commission) సోమవారం రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని 565 మండలాల్లో స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ. రాణి కుముదిని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... మొదట ఎంపీటీసీఎం, జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించి, తరువాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. అక్టోబర్ 9 నుండి ఐదు దశల్లో మొత్తం ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. మొదటి దశ ఎన్నికలు అక్టోబర్ 23న, రెండవ దశ ఎన్నికలు అక్టోబర్ 27న జరుగుతాయి. గ్రామ పంచాయతీలకు మొదటి దశ ఎన్నికలు అక్టోబర్ 31న, రెండవ దశ నవంబర్ 4న, మూడవ దశ నవంబర్ 8న జరుగుతాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత, అదే రోజున లెక్కింపు జరుగుతుంది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఓట్ల లెక్కింపు నవంబర్ 11న జరుగుతుందని రాణి కుముదిని పేర్కొన్నారు.